ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ ప్రభుత్వం కాకిలెక్కలు

February 19, 2020

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్న తీరుపై పొంతన లేని లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్న లెక్కలకు, ఆర్టీసీ అధికారులు చెబుతున్న లెక్కలకు తేడాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం 10 వేల బస్సులకు పైగా తిరుగుతున్నాయని మంత్రి లెక్కలు చూపిస్తుంటే, అధికారులు మాత్రం అబ్బే.. అలా కాదు కేవలం 5,074 బస్సులు తిరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నారు.
తెలంగాణవ్యాప్తంగా జిల్లాల్లో 50 శాతం బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మంత్రి మాత్రం 100 శాతం తిరుగుతున్నాయని మరీ లెక్కలు వేసి చూపిస్తున్నారు. మంత్రి చెబుతున్నది నిజం అనుకుంటే 10 వేల బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లు కలిస్తే 20 వేల మంది సిబ్బంది ఉన్నట్లు లెక్క. వాస్తవంగా సమ్మె కారణంగా ప్రైవేట్ సిబ్బంది కేవలం 6,126 మంది డ్యూటీలో ఉన్నారు. డ్రైవర్లు 3,063 మంది, కండక్టర్లు 3,063 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో సమ్మెకు ముందు ఆర్టీసీ, ప్రైవేట్ ఆధ్వర్యంలో 2,034 బస్సులు తిరిగేవి. సమ్మె తర్వాత 545 బస్సులు తిరుగుతున్నాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌లో సమ్మెకు ముందు 624 బస్సులు తిరిగితే, సమ్మె తర్వాత 317 బస్సులు తిరుగుతున్నాయని చెబుతున్నారు. కరీంనగర్‌లో సమ్మెకు ముందు 909, సమ్మె తర్వాత 504 బస్సులు, ఖమ్మంలో సమ్మె ముందు 633, సమ్మె తర్వాత 443, నిజామాబాద్‌లో సమ్మెకు ముందు 671, సమ్మె తర్వాత 366, వరంగల్‌లో సమ్మెకు ముందు 989, సమ్మె తర్వాత 505, సంగారెడ్డిలో సమ్మెకు ముందు 1,741, సమ్మె తర్వాత 534, రంగరెడ్డిలో సమ్మెకు ముందు 574, సమ్మె తర్వాత 283, నల్లగొండలో సమ్మెకు ముందు 745, సమ్మె తర్వాత 511, మెదక్‌లో సమ్మెకు ముందు 672, సమ్మె తర్వాత 503, మహబూబ్‌నగర్‌లో సమ్మెకు ముందు 873, సమ్మె తర్వాత 536 బస్సులు తిరుగుతున్నాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు.
అయితే వాస్తవంగా రాష్ట్రంలో తిరుగుతున్న బస్సుల సంఖ్య కేవలం 20 శాతం మాత్రమేనని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రహదారులపై బస్సుల ఫ్రీక్వెన్సీ చూసినా కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో మంత్రి అన్నీ కాకిలెక్కలు చెబుతున్నారని కార్మికులు అంటున్నారు. ప్రయివేటు వ్యక్తులతో బస్సులు తిప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, గందరగోళం ఏర్పడుతోందని అంటున్నారు.