ఊరికెళ్లినోళ్లు విలవిలలాడిపోతున్నారా?

August 10, 2020

ఉపాధి కోసం నగరానికి పరుగులు తీస్తూ వచ్చే వారు.. కష్టం వస్తే మాత్రం ముందుకు గుర్తుకు వచ్చేది ఊరే. ఆ మాటలో నిజమెంతన్న విషయాన్ని కరోనా చెప్పేసింది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్దదైన హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున కేసులు నమోదు కావటం తెలిసిందే. దాదాపు కోటి మంది ప్రజలు ఉండే హైదరాబాద్ మహానగరంలో నిత్యం వచ్చిపోయే వారి సంఖ్యే లక్షల్లో ఉంటుంది. ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో.. ఎవరికి వారు ఊళ్లకు వెళ్లటం షురూ చేశారు.

నగరంలో వసతులు ఉన్నా.. వైరస్ భయం ఎక్కువగా ఉండటం.. మహానగరాలతో పోలిస్తే.. పల్లెలు.. గ్రామాలు.. పట్టణాల్లో సేఫ్ గా ఉండొచ్చన్న భావన అందరిని ఊళ్లకు పయనమయ్యేలా చేసింది. ఒక అంచనా ప్రకారం దగ్గర దగ్గర హైదరాబాద్ మహానగరం నుంచి పాతిక లక్షల మందికి పైనే వెళ్లిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు కిక్కిరిసిపోయే రోడ్లు ఇప్పుడు విశాలంగా కనిపించటమే కాదు.. ప్రతి వీధిలోనూ టూలెట్ బోర్డులు భారీగా దర్శనమిస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు అందుకు భిన్నంగా బోసిపోయినట్లు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో ఊళ్లకు వెళ్లినోళ్లు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గడిచిన కొద్ది రోజులుగా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం.. పాజిటివ్ అయిన వారికి అందిస్తున్న వైద్య సాయం వారిని నగరం వైపు చూసేలా చేస్తుందని చెబుతున్నారు. దీనికి తోడు.. కనుచూపు మేర సమాధానం లేని నేపథ్యంలో పనులు లేక తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. ఉద్యోగుల విషయానికి వస్తే.. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉన్న వారికి నెట్ కనెక్టివిటీ సమస్యగా మారింది.

నగరాల్లో ఉన్నంత బలంగా సిగ్నల్స్ ఉండట్లేదు. నెట్ వేగం విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదుర్కొంటున్నారు. దీంతో.. ఊరికి వెళ్లిన వారిలో ఎక్కువమంది.. ఉదయాన్నే తమకు దగ్గర్లోని పట్టణాలకు వెళ్లి పనులు చేసుకొని రాత్రికి వస్తున్నారు. ఈ మధ్య వరకు ఇదేమీ ఇబ్బంది కలగకున్నా.. ఇటీవలకాలంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇబ్బందులకు గురవుతున్నారు.

దీనికి తోడు ఎవరైనా సీరియస్ గా ఎటాక్ అయితే.. అలాంటి వారికి వైద్య సాయం అందించేందుకు సదుపాయాలు తక్కువగా ఉండటంతో నగరం వైపు చూడటం మొదలైందని చెబుతున్నారు. ఊళ్లతో పోలిస్తే.. హైదరాబాద్ లో ఇటీవల కాలంలో తగ్గుతున్న కేసులు కూడా మహానగరం వైపు కన్ను పడేలా చేస్తుందని చెప్పక తప్పదు.

Read Also

అమరావతి అజరామరం... రైతులతో కలిసి న్యాయపోరాటం చేస్తాం - జయరాం కోమటి
జగన్ బీ రెడీ... లోకేష్ వైరల్ కామెంట్ !!
‘‘ఆందోళనొద్దు, అమరావతి చట్టం చెల్లదు‘‘