సోనియా మార్క్ - కాంగ్రెస్ సాహసోపేత నిర్ణయం

August 11, 2020

నానాటికీ వీకైపోయి... నేతల్లో చులకన అవుతున్న కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో స్థిరమైన ప్రభుత్వం ఉన్నా రాజకీయాల్లో సంక్షోభానికి కారణమై పార్టీ అధిష్ఠానాన్ని ఇరకాటంలో పడేసే చర్యలకు దిగిన యువనేత సచిన్ పైలట్ పై కాంగ్రెస్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్ ను ఆ పదవి నుంచి పీకేసింది.

ఈ నిర్ణయంలో సోనియా ముద్ర కనిపిస్తోంది. ఆమె చేతిలోకి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి దిక్కారాన్ని ఆమె సహించలేదు. ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు నుంచి జగన్ వరకు ఆమె పార్టీకి జరిగే డ్యామేజీ ని కూడా లెక్కచేయకుండా తన నిర్ణయాలకు కట్టుబడి ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం సోనియా ముద్రను కనిపించేలా చేసింది.

కేవలం డిప్యూటీ సీఎం పదవి నుంచే కాకుండా రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా ఆయనను తప్పిస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఆయనకు మద్దతు ఇచ్చిన ముగ్గురు మంత్రులను కూడా పదవుల నుంచి తప్పించారు. మొత్తానికి నువ్వు పోతే పో... పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పేసింది. 

ప్రస్తుతం రాజస్తాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కావడాన్ని ముందు నుంచి సచిన్ పైలట్ కి ఇష్టం లేదు. తాజాగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీనిపై చర్చించేందుకు సీఎల్పీ రెండు పర్యాయాలు సమావేశమైంది. ప్రియాంక గాంధీ చొరవ తీసుకుని పైలట్ తో మాట్లాడింది.   సీఎల్పీ భేటీకి రావాలంటూ రెండుసార్లు ఆహ్వానించినా సచిన్ పైలట్ నుంచి జవాబు రాకపోవడంతో ఆయనను సాగనంపడమే మంచిదని పార్టీ తీర్మానించింది. సచిన్ పైలట్ పై వేటు వేసే తీర్మానానికి సభ్యులందరూ ముక్తకంఠంతో సరేననడంతో అధిష్ఠానం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.