జగన్ బ్యాచ్ లోకి ఇంకో రెడ్డి... ఇకపై ఈయనదే హవానా?

June 03, 2020
CTYPE html>
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... పాలనకు సంబంధించిన కీలక స్థానాలతో పాటు తన చుట్టూ సంచరించాల్సిన అధికారులంతా తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేలా చూసుకుంటున్నారు. ఈ విషయంపై ఎన్నెన్ని విమర్శలు వచ్చినా కూడా జగన్ అస్సలు పట్టించుకోవడం లేదన్న మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పటికే కీలక స్థానాలన్నింటిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కూర్చున్న ప్రస్తుత తరుణంలో మరో రెడ్డి అధికారిని కూడా జగన్ కీలక పదవిలో నియమించారు. ఆయనే ఐఆర్ఎస్ అధికారి అయిన సాధు నరసింహారెడ్డి.
2006 ఐఆర్ఎస్ బ్యాచ్ కు చెందిన సాధు నరసింహారెడ్డి... ప్రస్తుతం ఈయన సెంట్రల్ ఎక్సైజ్ అదనపు కమిషనర్ హోదాలో విశాఖపట్నం జీఎస్టీ కార్యాలయంలో పని చేస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సాధు నరసింహారెడ్డిని ఏపీకి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చిన జగన్... ఆయనకు చాలా కీలక బాధ్యతలే అప్పగించారు. ఏపీ సర్వీసులోకి గురువారం నుంచే ఎంట్రీ ఇచ్చేసిన సాధు నరసింహారెడ్డిని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగానే కాకుండా వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పోస్టులు కూడా చాలా కీలకమైనవేనని చెప్పాలి. 
ఇటు ఆర్థిక శాఖతో పాటు అటు రాష్ట్రానికి కీలక ఆదాయాన్ని ఇచ్చే వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కమిషనర్ గా సాధు నరసింహారెడ్డి నియమితులు కావడంతో.. రాష్ట్ర ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఇకపై ఆయన కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు తీవ్రమైన ఆర్థిక లోటుతో సాగుతున్న ఏపీ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సంగతి తెలియనిదేమీ కాదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులను రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఇలా కీలక పదవులు అప్పగించి పెద్ద ఎత్తున వేతనాలు ఇచ్చేందుకు జగన్ నిర్ణయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తున్నాయి.