‘సాహో’ సునామీలో కొట్టుకుపోక తప్పదు

September 17, 2019

టాలీవుడ్లో ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురిదే హవా. బాక్సాఫీస్ దగ్గర హంగామా అంతా ఈ నలుగురిదే ఉండేది. కానీ తర్వాతి తరం రాకతో వీరి జోరు తగ్గింది. చిరు ఒక దశాబ్దం పాటు సినిమాలకు దూరం కాగా.. మిగతా ముగ్గురు సీనియర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. యువ కథాానాయకుల జోరు ముందు వీరు నిలవలేకపోయారు. చిరు పునరాగమనంలో తన స్టామినా చూపించే ప్రయత్నంలో ఉండగా.. మిగతా ముగ్గురు సీనియర్లు మాత్రం యువ కథానాయకుల జోరును తట్టుకోలేకపోతున్నారు. వెంకీ కాలం కలిసొచ్చి ‘ఎఫ్-2’తో పెద్ద హిట్ కొట్టినా.. ఆయన ఫాలోయింగ్, మార్కెట్ పెరిగిపోయిందనేమీ అనుకోవడానికి వీల్లేదు. ఇక బాలయ్య, నాగార్జునల పరిస్థితేంటో తెలిసిందే. ఇద్దరూ స్ట్రగులవుతున్నారిప్పుడు.
నాగ్ విషయానికి వస్తే ‘ఓం నమో వేంకటేశాయ’, ‘రాజుగారి గది-2’, ‘ఆఫీసర్’, ‘దేవదాస్’ లాంటి ఫెయిల్యూర్లతో ఆయన బాగా వెనుకబడి పోయి ఉన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చేస్తున్న ‘మన్మథుడు-2’కు కూడా పెద్దగా హైప్ లేదు. అదే పనిగా మేకింగ్ ఫొటోలు రిలీజ్ చేసి హడావుడి చేస్తున్నా సినిమాకు బజ్ రాలేదు. ఇలాంటి సమయంలో దీని టీజర్ లాంచ్కు రంగం సిద్ధం చేశారు. కానీ అందుకు ఎంచుకున్న ముహూర్తమే సరిగా లేదు. ఈ నెల 13న ‘మన్మథుడు-2’ టీజర్ లాంచ్ చేయాలని నిర్ణయించారు. కానీ అదే రోజు ‘సాహో’ టీజర్ కూడా వస్తోంది. దానిపై దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. దాని తాకిడిని బాలీవుడ్ సినిమాలు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. ‘సాహో’పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో 13న సోషల్ మీడియా అంతటా ఇదే హాట్ టాపిక్ కావడం ఖాయం. అలాంటి సమయంలో ‘మన్మథుడు-2’ టీజర్ గురించి ఎవరు పట్టించుకుంటారు? దాని గురించి డిస్కషన్ ఏముంటుంది? జనాల అటెన్షన్‌ను అదెలా రాబడుతుంది? ‘సాహో’ టీజర్ అప్ డేట్ తెలిసి కూడా ‘మన్మథుడు-2’ టీజర్ కూడా అదే రోజు రిలీజ్ చేయాలనుకోవడం బ్యాడ్ ప్లానింగే కదా?