రానాను భలే ఇరుకున పెట్టేశాడే..

August 05, 2020

మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్.. తన తోటి యువ కథానాయకుల్ని ఇరుకున పెట్టేస్తున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే కొత్త సినిమా చేస్తున్న తేజు.. ఈ సినిమా కాన్సెప్టుకు తగ్గట్లే ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. ‘మన్మథుడు’లో నాగార్జున లాగే పెళ్లంటే నూరేళ్ల మంట అంటూ సింగిల్ బాబులకు ఉపదేశం చేస్తున్నాడు. ఇందులో బాగంగా ‘నో పెళ్లి’ అంటూ కొత్త పాట ఒకటి రిలీజ్ చేశాడు.

ఆ పని ఇప్పటికే పెళ్లి ఖాయమైన నితిన్‌తో చేయించడం విశేషం. అంతటితో ఆగకుండా ఈ పాటలో తన బావ వరుణ్ తేజ్, తన స్నేహితుడు రానా దగ్గుబాటిలను వాడేశాడు. వాళ్లిద్దరితో పెళ్లి గురించి వ్యతిరేక ప్రచారం చేయించాడు. పెళ్లి వల్ల ఎన్నెన్ని కష్టాలుంటాయో.. సింగిల్‌గా ఉండటం ఎంత మంచిదో చెప్పించాడు. ఐతే వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాళ్లే.

వరుణ్ తేజ్‌కు వచ్చే ఏడాదే పెళ్లి చేయబోతున్నట్లు అతడి తండ్రి నాగబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇక రానా సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యే మిహీకా బజాజ్‌తో ఎంగేజ్ అయ్యాడు. పెళ్లికి సన్నాహాలు కూడా మొదలైపోయాయి. మరి తేజు పాటలో కనిపించే సమయానికి అతను ఎంగేజ్ అయ్యాడో లేదో తెలియదు మరి. ఐతే పెళ్లికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో పెళ్లి గురించి వ్యతిరేక ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? అందుకే అతణ్ని సోషల్ మీడియా జనాలు ఆడేసుకుంటున్నారు.

ఓ వైపు పెళ్లి చేసుకోబోతూ.. ఈ పాటలో ఆ ప్రచారాలేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తన కొత్త సినిమాను తేజు ప్రమోట్ చేసుకుంటున్న తీరైతే బాగుంది. ‘చిత్రలహరి’తో బౌన్స్ బ్యాక్ అయిన తేజు.. ‘ప్రతి రోజూ పండగే’ మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’కు ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది.