టీవీ9 లో విజయసాయిరెడ్డి స్లీపింగ్ పార్ట్ నర్ ?

July 13, 2020

రాష్ట్రంలో రవిప్రకాష్ అరెస్టు ఒక సంచలనం అయితే... ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యలో దూరి వైకాపా నేత విజయసాయిరెడ్డి కోర్టుకు లేఖలు రాయడం మరో సంచలనం. దీనిపై జనాలకు అనేక అనుమానాలు కలిగాయి. ఇతరులు ఎవరైనా లేఖ రాసి ఉంటే... అది పెద్దగా పట్టించుకునే వారు కాదు గాని... మనీ లాండరింగ్, ఆర్థిక అక్రమ లావాదేవీల కేసుల్లో అరెస్టు అయ్యి, అనేక నెలలు జైల్లో గడిపిన వ్యక్తి... అలాంటి కేసు గురించి లేఖలు రాయడం నిజంగా ఆశ్చర్యకరమే. అసలు టీవీ9 కొత్త యాజమాన్యం, పాత యాజమాన్యం గొడవలో సాయిరెడ్డి ఎందుకు దూరాడో చాలా మందికి అర్థం కావడం లేదు. అయితే, అయోమయానికి కొత్త ప్రశ్నతో మరింత ఆసక్తి రేపాడు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. 

తనకు సంబంధం లేని కేసులో విజయసాయిరెడ్డి తలదూర్చడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెప్పిన కనకమేడల... అసలు కారణం టీవీ9 కొత్త యాజమాన్యంలో సాయిరెడ్డి ఒక స్లీపింగ్ పార్టనర్ అయ్యి ఉంటాడని ఆసక్తికరమైన సందేహం లేవనెత్తాడు. వాస్తవానికి వ్యవహారం అంతా చూస్తే ఈ ఆరోపణ బానే సింకవుతోంది. ఈ కేసు వ్యవహారం నడిచిన తర్వాత సాయిరెడ్డి కేసీఆర్ కాళ్లకు దండం పెట్టిన విషయం ఎవరూ మరిచిపోరాదు. 

ఇక దీనితో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. జగన్ అక్రమాలను టీవీ9 సీఈవోగా ఉన్నపుడు రవి ప్రకాష్ గట్టిగా ప్రచారం చేశారని, ఆ క్రమంలో తనను కూడా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఈ లేఖలు రాసినట్టు కనకమేడల ఆరోపించారు. అసలు మనీలాండరింగ్, సూట్ కేసు కంపెనీల కేసులకు జాతిపిత వంటివాడు విజయసాయిరెడ్డి అని కనకమేడల విమర్శించారు. పాత కక్షలతో రవి ప్రకాష్ ను ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారా? లేక తాను టీవీ9లో ఒక భాగస్వామి కావడం వల్ల పోరాడుతున్నాడా అని ప్రశ్నించారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం... ఒక బెయిల్ హియిరింగ్ నడుస్తున్నపుడు ఇలాంటి లేఖలు పెద్ద కోర్టులకు రాయడం ద్వారా బెయిలు ఆపే ప్రయత్నం జరుగుతోందని అనిపిస్తుందన్నారు. ఇలా వ్యవహరించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అని, ఆధారాలు ఉంటే కోర్టులో పిల్ వేయాలి గాని ఇలా లేఖలు రాయడం వెనుక కుట్ర ఉందన్నారు.