వేతనజీవికి కడుపు కోత!

August 12, 2020
 

కరోనా సాకుతో జీతంలో సగం కట్‌
వరుసగా రెండో నెలలోనూ అమలు
వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి
పూర్తి వేతనాల చెల్లింపు
మార్చి నెల పెన్షన్‌లో సగం కోత
ఏప్రిల్‌కు మాత్రం పూర్తిగా చెల్లింపు
కేంద్రం నిధులిచ్చినా బీద అరుపులు
తెలంగాణ ప్రభుత్వానిదీ అదే దారి


రాష్ట్రంలో 80 శాతం మండలాల్లో కరోనా ప్రభావమే లేదంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌.. లాక్‌డౌన్‌ ఆంక్షలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న ఉద్యోగులకు మాత్రం జీతాల్లో కోతపెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారుల వేతనాల్లో కోతపెట్టినా.. పూర్తిగా చెల్లించకున్నా ఇబ్బందేమీ ఉండదు.

ఎందుకంటే వారంతా స్థితిమంతులే. కానీ కష్టపడి పనిచేసే వేతన జీవులకు ఫస్టు తారీఖున జీతం వస్తేనే ఇల్లు గడిచేది. ఇంటి అద్దెలు, నిత్యావసరాలు, స్కూళ్ల ఫీజులు, ఈఎంఐలు.. ఇలా ఎన్నో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. వారందరికీ సగం వేతనమే ఇస్తే బతకడమెలాగన్నది జగన్‌ ప్రభుత్వం ఆలోచించిందో లేదో తెలియదు. తుదకు పెన్షన్లపై ఆధారపడే పింఛనుదారులకూ సగం కోతపెట్టారు. ఇది మానవత్వమే లేని చర్య.

కరోనాపై పోరాటానికి కేంద్రం నుంచి రాష్ట్రప్రభుత్వానికి రూ.10,173 కోట్లు వచ్చాయి. ఆరోగ్య, పురపాలక సిబ్బందికి, పారిశుద్ధ్య పనివారికి ఇప్పటికీ చాలా చోట్ల మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వలేదు. అదేమని అడిగిన డాక్టర్లను, కమిషనర్లను సస్పెండ్‌ చేయడానికి క్షణం ఆలస్యం చేయని ప్రభుత్వం.. మాస్కులు, పీసీఆర్‌ కిట్లను మాత్రం సమకూర్చడం లేదు.కేంద్రానికి పంపిన లెక్కల్లో మాత్రం 12 కోట్ల మాస్కులు, 2.5 లక్షల పీసీఆర్‌ కిట్లు కనబడుతున్నాయి.

రాష్ట్రంలో 8-9 మండలాల్లో తప్ప నోటి మాస్కులు పంపిణీ చేసిన పాపాన పోలేదు. పేదలకు పంపిణీ చేసిన రూ,1,000 కూడా కేంద్రం ఇచ్చినవే. స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థులు ఆ మొత్తాన్ని తమ సొమ్ముగా జనాలకు పంపిణీ చేయడం వేరే విషయం.మార్చి నెలతో పాటు ఏప్రిల్‌ నెల వేతనాల్లో కూడా ప్రభుత్వం కోతపెట్టింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల వేతనాల్లో 60 శాతం చెల్లింపును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల్లో పది శాతం కోతపెట్టారు. మిగతా అధికారులు, ఉద్యోగులందరికీ 50 శాతం చెల్లింపును వాయిదా వేశారు. మార్చి నెల పెన్షన్లో కోత పెట్టడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. దాంతో ఏప్రిల్‌ నెల పెన్షన్‌ పూర్తిగా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. అయితే మార్చి నెలలో చెల్లించాల్సిన సగం పెన్షన్‌ను ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేదు. వాయిదా వేసిన వేతనాల మొత్తాన్ని ప్రభుత్వం వద్ద నిధులున్నప్పుడు చెల్లిస్తామని ప్రకటించారు.

ఇవి వారికి చేతికి ఇచ్చే పరిస్థితే లేదు. జీపీఎఫ్‌లో కలిపేస్తామని చెబుతారు. అంటే రిటైరైతే తప్ప ఆ సొమ్ము వారి కంటపడదన్నమాట. మరి ఈ వేతనాలు మిగిల్చి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? కరోనాపై పోరాటానికి అందులో పైసా కూడా ఉపయోగించలేదు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు రూ.1,800 కోట్ల మేర బకాయిలు, అడ్వాన్సులు చెల్లించింది. ఇందులో చేయని పనులు చాలానే ఉన్నాయి.

అడ్వాన్సుగా కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఈ వివరాలను ప్రతిపక్షాలు బయటపెట్టడంతో కాంట్రాక్టర్లకు చెల్లించింది రూ.300 కోట్లేనని.. మిగతా మొత్తం కొవిడ్‌ సేవలకు ఉపయోగిస్తామని అసత్యాలు చెప్పింది. వేతనాల కోతలో జగన్‌కు కేసీఆర్‌ ఎప్పటిలాగే ఆదర్శంగా నిలిచారు. అచ్చం అక్కడ ఎలాంటి కోతలు విధించారో ఇక్కడా అవే కోతలు పెట్టారు.

కాకపోతే తెలంగాణలో సీఎం, మంత్రులు, సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 75 శాతం కోత విధించారు. నిజానికి వైరస్‌ నియంత్రణకు కేంద్రం పెద్దఎత్తున ఖర్చుచేస్తోంది. కానీ తన సిబ్బందికి గానీ, పెన్షనర్లకు గానీ పైసా కోత పెట్టలేదు. కాకపోతే ఇటీవల ప్రకటించిన డీఏ చెల్లింపును వచ్చే ఏడాదికి వాయిదావేసింది.