స‌ల్మాన్ భ‌లే టైటిల్ పెట్టాడుగా..

May 31, 2020
హిట్లు ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా దూసుకెళ్లిపోతున్నాడు స‌ల్మాన్ ఖాన్. వ‌రుస‌గా సినిమాలు అనౌన్స్ చేస్తూ అభిమానుల్ని మురిపిస్తున్నాడు. గ‌త ఏడాది అత‌డికి అంత‌గా క‌లిసి రాలేదు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన భార‌త్, ద‌బంగ్‌-3 అంచ‌నాల్ని అందుకోలేక‌పోయాడు. ఓపెనింగ్స్ బాగా తెచ్చుకున్నా.. లాంగ్ ర‌న్లో సినిమాలు నిల‌వ‌లేక‌పోయాయి. మ‌రోవైపు సంజ‌య్ లీలా బ‌న్సాలీతో  చేయాల‌నుకున్న ఇన్షా అల్లా అనివార్య కార‌ణాల‌తో ఆగిపోయింది. అయినా స‌ల్మాన్‌లో ఉత్సాహం ఏమీ త‌గ్గ‌లేదు. ద‌బంగ్‌-3 చేస్తున్న‌పుడే దాని ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవాతో రాధె అనే సినిమాను అనౌన్స్ చేశాడు. అది స‌ల్మాన్ కోసం రాసిపెట్టిన రంజాన్ సీజ‌న్లో విడుద‌ల కాబోతోంది. ఇంత‌లో స‌ల్మాన్ మ‌రో సినిమాల‌ను ప్ర‌క‌టించాడు.
ఆ సినిమా పేరు.. క‌బీ ఈద్ క‌బీ దివాలీ కావ‌డం విశేషం. స‌ల్మాన్ తండ్రి ముస్లిం, త‌ల్లి హిందువు. ఈ నేప‌థ్‌యంలో రెండు మ‌తాలనూ గౌర‌విస్తూ.. త‌న సినిమాల్లో హిందూ-ముస్లింల మ‌ధ్య సోద‌ర‌భావాన్ని చాటే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు స‌ల్మాన్. ఈ నేప‌థ్యంలోనే త‌న కొత్త చిత్రానికి ముస్లిం, హిందువుల పండ‌గ‌ల పేర్లు క‌లిసొచ్చేలా పెట్టిన‌ట్లున్నాడు. స‌ల్మాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన నిర్మాత‌  సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయ‌నున్నాడు. క‌థ కూడా ఆయ‌నే అందించాడు. గ‌త ఏడాది సాజిద్ నిర్మాణంలో హౌస్ ఫుల్- 4 మూవీని డైరెక్ట్ చేసిన ఫ‌ర్హ‌ద్ సాంజి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ప్రతి ఏటా రంజాన్ కి ఓ చిత్రం విడుదల చేసే అలవాటున్న సల్మాన్ 2021 రంజాన్ కి కభీ ఈద్ కభీ దివాలి సిద్ధం చేస్తున్నాడు. ఈ ఏడాది ఈద్‌కు రాధె రానున్న సంగ‌తి తెలిసిందే.