ఈవీఎంలతో ఒక ఆట ఆడుకుంటాడట !

May 25, 2020

దివంగ‌త మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి సాంకేతిక స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన శ్రామ్ పిట్రోడా చాలామందికి సుప‌రిచితుడే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాల‌జీల మీద ఆయ‌న‌కు అవ‌గాహ‌న ఉంద‌ని.. కొన్ని అంశాల మీద ఆయ‌న‌కు ప‌ట్టుంద‌ని చెబుతారు. యూపీఏ అధికారంలో ఉన్న‌న్ని రోజులు.. ఆయ‌న హ‌వా ఓ రేంజ్లో న‌డుస్తుంటుంద‌ని చెబుతారు. సాంకేతిక అంశాల విష‌యంలో కాంగ్రెస్ ఆధార‌ప‌డే ప్ర‌ముఖుడిగా శ్యామ్ పిట్రోడాకు పేరుంది.
అలాంటి ఆయ‌న తాజాగా ఈవీఎంల మీద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈవీఎంల‌లో ఏదో తేడా ఉంద‌ని ఆయ‌న అంటున్నారు. అలా అని.. అదేమిటో తాను చెప్ప‌లేన‌ని.. త‌న చేతికి ఒక ఈవీఎం.. ఒక ఏడాది టైమిస్తే.. దాన్లో ఉన్న తేడాను తాను చెప్పేస్తాన‌ని చెబుతున్నారు. ఒక ఇంజ‌నీర్ గా.. సాంకేతిక నిపుణుడిగా ఈవీఎంల మీద త‌న‌కు సంతృప్తి లేద‌ని చెప్పారు.
అలా అని త‌న‌ను లోపం చెప్ప‌మంటే వెంట‌నే చెప్ప‌లేన‌ని చెబుతున్నారు. తాను అధ్య‌య‌నం చేయ‌టానికి క‌నీసం ఏడాది స‌మ‌యం త‌ప్ప‌నిస‌రి అన్న ఆయ‌న‌.. ఈవీఎం డిజైన్.. సాఫ్ట్ వేర్ ను అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రాన్ని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా వినియోగిస్తున్న ఈవీఎంల మీద విప‌క్ష నేత‌లు పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.
క‌నీసం వీవీ ఫ్యాట్ల‌లో ప‌డిన ఓట్ల‌ను లెక్కించాల‌ని చెబుతున్నారు. ఈ విష‌యం మీద ఇప్ప‌టికే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌టంతో పాటు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని డిమాండ్ చేశారు. 50 శాతం వీవీ ఫ్యాట్ల‌ను లెక్కించాల‌న్న విష‌యంపై సుప్రీం స్పందిస్తూ.. ఈసీని వివ‌ర‌ణ కోర‌గా.. అలా చేస్తే.. ఎన్నిక‌ల ఫ‌లితాల్ని వెల్ల‌డించ‌టానికి క‌నీసం ఆరు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఐదు ఈవీఎంల‌లోని వీవీ ఫ్యాట్ల ర‌సీదుల్ని ప‌రిమితంగా లెక్కించాల‌ని సుప్రీం పేర్కొంది.
ఈ విష‌యాన్ని ఇలా ఉంచితే.. ఈవీఎంల‌లో ఏదో తేడా ఉందంటూ శామ్ పిట్రోడా వెల్లుబుచ్చిన సందేహం ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌రి.. దీనిపై బీజేపీ వ‌ర్గాలు.. ఈసీ ఏమ‌ని రియాక్ట్ అవుతాయో చూడాలి.