బాలాకోట్ మాస్టర్‌మైండ్‌ భుజాలపై మరింత పెద్ద బాధ్యత

July 06, 2020

బాలాకోట్ వైమానిక దాడులపై విపక్షాలు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా, ఎన్ని విమర్శలు చేసినా కూడా జనం దాన్ని హర్షించారు. అలాంటి బాలాకోట్ దాడుల వెనుక వ్యూహకర్త భుజాలపై మోదీ ప్రభుత్వం మరింత పెద్ద బాధ్యతలు మోపింది. ఏకంగా రీసెర్చి అండ్ అనాల్సిస్ వింగ్(రా)కు అధిపతిని చేసింది.
కేంద్ర ప్రభుత్వం రెండు ప్రధాన ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలకు డైరెక్టర్‌ జనరల్స్‌ను నియమించింది. రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌‌కు అధిపతిగా సామంత్‌ గోయెల్‌ నియమితులయ్యారు. అనిల్‌ ధంసానా స్థానంలో గోయెల్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధిపతిగా ఆ బ్యూరో కశ్మీర్‌ విభాగంలో నెంబర్‌ 2గా ఉన్న అరవింద్‌ కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న రాజీవ్‌ జైన్‌ స్థానంలో అరవింద్‌ నియమితులయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ వీటిని ఆమోదించిందని, వీరి పదవీ కాలం రెండేళ్లని సిబ్బంది మంత్రిత్వశాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రస్తుత ఐబీ చీఫ్‌ రాజీవ్‌ జైన్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండటంతో అర్వింద్‌ బాధ్యతలు చేపడతారు. శనివారంతో రా అధిపతి అనిల్‌ ధస్మాన పదవీ కాలం ముగియనుండటంతో సామంత్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.
సామంత్‌ 1984 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ‘రా’లో ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిగా చేపట్టిన బాలాకోట్‌ వైమానిక దాడుల ప్రణాళికలు రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. ఉరీ ఉగ్రదాడులకు ప్రతీకారంగా 2016లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడుల వెనకా ఈయన పాత్ర కీలకం. నిఘా వ్యవహారాలు, ఆపరేషన్ల నిర్వహణలో చాలా అనుభవం ఉంది. గతంలో 2000-01 మధ్య పంజాబ్‌ సీఎం భద్రతా బాధ్యతల్ని పర్యవేక్షించారు. పంజాబ్‌ తీవ్రవాదం, పాకిస్థాన్‌ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో నిపుణుడిగా పేరుంది. 1990ల్లో పంజాబ్‌లో తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలో ముఖ్య భూమిక పోషించారు. రెండు పోలీసు పతకాలు సాధించారు. ఎక్కువ కాలంపంజాబ్‌లోనే పనిచేశారు. 2001లో ‘రా’లో చేరారు.
ఇక కొత్త ఐబీ చీఫ్ అర్వింద్‌కుమార్‌ 1984 బ్యాచ్‌ అసోం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఐబీలో ప్రత్యేక డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 నుంచి ఐబీలో పని చేస్తున్నారు. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో కూడా పని చేశారు. ఈయనకు కశ్మీర్ వ్యవహారాల్లోనే కాదు నక్సల్స్ వ్యవహారాల్లోనూ మంచి పట్టుంది.