ఆ ఫొటో చూసి తిట్టారు.. మ‌ళ్లీ అలాగే పెట్టా-స‌మంత‌

August 08, 2020

పెళ్లి త‌న‌లో ఏ మార్పూ తీసుకురాలేద‌ని అనేక సంద‌ర్భాల్లో చాటిచెప్పే ప్ర‌య‌త్నం చేసింది స‌మంత‌. నాగ‌చైత‌న్య‌తో వివాహం త‌ర్వాత కూడా ఆమె చురుగ్గా సినిమాలు చేస్తూ వ‌చ్చింది. అలాగే కొన్ని గ్లామ‌ర్ ఫొటో షూట్లు చేసి వాటిని సోష‌ల్ మీడియాలో పంచుకుంది. ఐతే అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీలోకి వెళ్లిన నీకు ప‌ద్ధ‌తిగా ఉండాల‌ని తెలియ‌దా అంటూ నెటిజ‌న్లు ఆమె మీద విరుచుకుప‌డిపోయారు అప్ప‌ట్లో. అయితే ఆ కామెంట్లు త‌న‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌లేద‌ని అంటోంది సామ్. ఇలా త‌న‌ను తిట్టిన వాళ్ల‌కు బుద్ధి చెప్ప‌డానికి మ‌ళ్లీ కావాల‌నే మ‌రిన్ని గ్లామ‌ర‌స్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేశాన‌ని.. దీంతో అంద‌రి నోళ్లు మూత‌ప‌డ్డాయ‌ని ఆమె తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.
‘‘నాకింకా గుర్తుంది. పెళ్లి తర్వాత ఓ గ్లామరస్‌ డ్రెస్‌తో ఉన్న ఫొటో పోస్ట్ చేశా. కొందరు ఘోరంగా విమర్శించారు. చాలా కష్టంగా అనిపించింది. అలానే రెండోసారి కూడా ఫొటో షేర్‌ చేశా. అప్పుడు విమర్శలు తగ్గాయి. ఏదైనా సరే.. మొదటి అడుగు వేయడం వరకే అని అప్పుడు అర్థమైంది. నేను ధైర్యంగా ముందుకొచ్చానని చెప్పడం లేదు. నాకు విమర్శలన్నా, అలాంటి వాతావరణం అన్నా చాలా భయం. పరిస్థితులు మారాలి. దానికి తగినట్లు నేను ప్రవర్తించాలని అనుకుంటుంటా. మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్వచించవని ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని స‌మంత చెప్పుకొచ్చింది. నిజానికి పెళ్లి తర్వాత త‌న‌కు కెరీర్‌పై ఆశలు పోయాయ‌ని.. త‌న‌కంటే ముందు హీరోయిన్ల‌ పరిస్థితి అలానే ఉండేద‌ని.. వాళ్లంతా పెళ్లి తర్వాత మళ్లీ కనిపించలేద‌ని.. త‌న‌కూ అలాగే జరుగుతుంద‌నుకున్నాన‌ని.. ఐతే పెళ్లి ప్రభావం త‌న‌ కెరీర్‌పై పడకపోవడం చాలా సంతోష‌మ‌ని.. కుటుంబం మ‌ద్ద‌తు వ‌ల్ల సినిమాల్లో ఏ ఇబ్బంది లేకుండా కొన‌సాగాన‌ని.. అలాగే త‌న ఫ్యాష‌న్ ఛాయిస్ కూడా మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోయింద‌ని స‌మంత చెప్పింది.