​చిరంజీవి, నాగార్జునలపై సాదినేని యామిని విమర్శలు

August 03, 2020

సినిమా వారికి స్వార్థ ప్రయోజనాలు తప్ప సామాజిక ప్రయోజనాలు అస్సలు పట్టవు అంటూ బీజేపీ నేత సామినేని యాదిని తీవ్ర విమర్శలు చేశారు. ఇపుడు ఏపీలో వారి కోట్లాది మంది అభిమానులు ఇసుక బాధితుల్లో ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో ఉన్నారు. అమరావతి బాధితుల్లో, కరోనా బాధితుల్లో ఉన్నారు... వాళ్ల అభిమానులు ఎవరో కాదు ప్రజలే అనే విషయం గుర్తుంచుకోవాలని సినిమా వారిని హెచ్చరించారు సామినేని యాదిని.

తమ ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి కలిశారు. వైజాగ్ ని పొగిడారు. మరి వైజాగ్ లో ఉన్న ఎల్జీ పాలిమర్స్ సమస్యపై స్పందించరా? ముఖ్యమంత్రిని పొగిడి తమ సమస్యలు పరిష్కరించుకోవడం, తమ పబ్బం గడుపుకోవడమేనా ? అంటూ ఆమె ఆగ్రహించారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరు పడిన అనంతరం ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ టాలీవుడ్ వాళ్లెవరూ స్పందించలేదని ఆమె తప్పుపట్టారు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయి, 13 మంది మరణించినా, ఒక్క హీరో కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేదు, కంపెనీని తప్పు పట్టలేదు. తమను సమాజమే సెలబ్రిటీలను చేసిందని గుర్తించాలి, అలాంటి సమాజం ఆశలు, ఆకాంక్షల కోసం వారు పాటుపడాలి అన్నారు. అమరావతి రాజధాని ఉద్యమంపై ఒక్క మాట మాట్లాడని చిరంజీవి వైజాగ్ రాజధాని గురించి ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారావిడ.