ఏపీ సర్కారును గడగడలాడిస్తున్న సమస్య ఇదే

August 12, 2020

ఏపీ ప్రభుత్వం ఒక సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దేనికీ భయపడిన సర్కారు దానికి తీవ్రంగా భయపడుతోంది. పార్టీని ఎక్కడ దెబ్బతీస్తుందో అన్న భయం ఇపుడు ప్రభుత్వంలో మొదలైంది. అధికారులు, నాయకులు తలమునకలైనా సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక తలపట్టుకుంటున్నారు. ఇంతకీ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ సమస్య ఏంటో తెలుసా.. ఇసుక.

తెలుగుదేశం హయాంలో ఇసుక ఉచితంగా దొరికినా అప్పట్లో వైసీపీ అనేక ఆరోపణలు చేసింది. ఎవరైనా ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉండేది. దీంతో తక్కువ ధరలో ఇసుక విరివిగా దొరికేది. ఇసుక రీచ్ లు దూరంగా ఉన్నవారు కొనుక్కునేవారు. దగ్గరగా ఉన్నవారు స్వయంగా ట్రాక్టరో, బండో, లారీయో తెచ్చుకుని తోలుకెళ్లేవారు. కానీ నేడు ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. చాలామంది ఇది ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు.

ఇంకొందరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రతిసారీ విఫలం అవుతున్నారు. వారు బుక్ చేసుకునే లోపే అవుటాఫ్ స్టాక్ అని వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... అనేక కారణాలున్నాయి. ఆయా ఊళ్లో కొందరు యువకులు చాకచక్యంగా దీనిని బల్క్ లో కొనేసి బ్లాక్ లో అమ్ముతున్నారు. ఇపుడు ఈ బ్లాక్ ధరల్లో కొని ఇళ్లు కట్టుకోవాల్సిన పరిస్థితి. ఊరికి దగ్గర్లో ఏట్లో ఇసుక ఉన్నా తోలుకోవడానికి లేదు. బుక్ చేసుకోవాల్సిందే. ఇంకో సమస్య... ఇసుక రీచ్ లో బయలుదేరుతున్న లోడ్లు ఏపీలోని యార్డులకు రాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. దీంతో ఏపీలో ఇసుక కొరత వస్తోంది. దీంతో జనానికి ఇరిటేషన్ వస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలను, నేతలను జనం నిలదీస్తున్నారు. గవర్నమెంటుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ వ్యతిరేకత నుంచి పార్టీని కాపాడటానికి పార్టీ ఎమ్మెల్యేలతో నిరసనలు చేయించే కొత్త ఎత్తుగడను వేసింది. ఎన్ని ఎత్తుగడలు వేసినా ఇసుక దొరక్కపోతే జనంలో కోపం తగ్గదు. ఇది జగన్ సర్కారుకు అర్థమైంది. దీంతో దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. అక్కడ చర్చకు వచ్చిన విషయం ఏంటంటే... ఏపీ ఇసుక పాలసీయే రాంగ్ అని.

దీంట్లో అన్ని సాధకబాదకాలు చూసిన తర్వాతే తెలుగుదేశం గవర్నమెంటు ఉచితం అని ప్రకటించింది. కానీ ఇదో పెద్ద ఆదాయమార్గంగా భావించిన వైసీపీ నేతలు పండగ చేసుకుందాం అనుకున్నారు. కానీ పార్టీకి ఇది ప్రమాదంలా మారింది. దీంతో జగన్ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అవి కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉన్నాయి. అందులోనూ అనేక మెలికలు.

నదులు, ఏరుల్లో పరిసర గ్రామాల ప్రజల సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లేవారికి ఇసుక ఉచితం అంట. కానీ ఒక మెలిక పెట్టారు. గ్రామ కార్యదర్శి అనుమతి కావాలట. ఇదొక కొత్త దందాకు దారితీస్తుంది. ఇంకో విషయం... ఎడ్లబండిలో తీసుకెళ్తే వ్యాపారం చేస్తారేమో అని ఇంకో అనుమానం వచ్చింది సర్కారుకి. అందుకే ఎడ్లబండిలో తీసుకెళ్లి అమ్మకూడదు అని నిబంధన పెట్టారు. ఈ మెలిక వల్ల స్థానిక కార్యదర్శి, నేతలు కుమ్మక్కయితే... తమకు నచ్చని వారిని ఏడిపించొచ్చు.

మరో నిర్ణయం ఏంటంటే... ఇసుక అవుటాఫ్ స్టాక్ అవకుండా అందరికీ అందుబాటులో ఉండేలా పోర్టల్ నుండి బల్క్ ఆర్డర్ల తొలగించారు. ఇక నుంచి ఎక్కువ ఇసుక అవసరమైన వారికి కొత్త తలనొప్పి వచ్చింది. మళ్లీ దీనికి ఒక మెలిక. బల్క్ లో ఆర్డరిచ్చే అవకాశాన్ని జేసీకి ఇచ్చింది. ఇదో వ్యాపారానికి దారితీసే అవకాశం లేకపోలేదు. గ్రామసచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించనున్నారట. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇంకా ఇవి అన్నిచోట్లా సిద్ధం కాలేదు.

ఇలా తలాతోకా లేకుండా అయోమయంగా ఉన్న ఇసుక పాలసీ ప్రభుత్వాన్ని ప్రజల్లో భారీగా డ్యామేజ్ చేస్తోంది. మందు, ఇసుక గ్రామాల్లో వైసీపీ నేతలకు, అధికారులకు నిద్ర పట్టనివ్వని పరిస్థితి. ఈ కోణంలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారికి కౌంటర్లు ఇచ్చే పరిస్థితుల్లో వైసీపీ నేతలు లేరు.