పాక్ న‌టిని దులిపేసిన సానియా ట్వీట్ !

August 07, 2020

ఒక‌రి వ్య‌క్తిగ‌త అంశాల్ని మ‌రొక‌రు ఎత్తి చూప‌టం.. స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌టం లాంటివి అన‌వ‌స‌రం. అయితే.. ఈ చిన్న విష‌యాన్ని మ‌ర్చిపోతుంటారు. ఒక‌వేళ నిజంగానే వారి మీద త‌మ‌కు ప్రేమాభిమానాలు ఉంటే.. వ్య‌క్తిగ‌తంగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కూడా. కానీ.. అందుకుభిన్నంగా ప‌బ్లిక్ డొమైన్ లో.. అందులోనూ సోష‌ల్ మీడియాలో ఓవ‌రాక్ష‌న్ చేస్తున్న‌ట్లుగా చేసే ట్వీట్లు చిరాకు పుట్టించ‌ట‌మే కాదు.. ప్రైవ‌సీలోకి చొచ్చుకొచ్చిన‌ట్లుగా ఉంటుంది.
తాజాగా అలాంటి ప‌నే చేసిన పాక్ న‌టి వీణా మాలిక్ కు ఘాటుగా బ‌దులిచ్చింది టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా. సానియా ఆమె భ‌ర్త షోయ‌బ్ మాలిక్.. కొడుకు ఇజాన్ తో పాటు ఇత‌ర పాక్ క్రికెట‌ర్లు క‌లిసి ఒక హుక్కా బార్ కు వెళ్ల‌టం.. అక్క‌డ సానియా హుక్కా తాగుతున్న‌ప్పుడు తీసిన వీడియోను ఒక నెటిజ‌న్ పోస్ట్ చేసి.. దాన్ని డిలీట్ చేశాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ పాక్ సినీ న‌టి వీణామాలిక్ సానియా ట్విట్ట‌ర్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ భారీ సందేశాన్ని పోస్ట్ చేశారు.

‘సానియా.. మీ అబ్బాయి విషయంలో నేను చింతిస్తున్నాను. మీరంతా కలిసి ఆ చిన్నారిని హుక్కా బార్‌కు తీసుకెళతారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నాకు తెలిసినంత వరకు మీరు వెళ్లిన బార్‌లో ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ అమ్ముతూ ఉంటారు. క్రీడాకారులైన మీరు, మీ భర్త ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఓ తల్లిగా మీకు ఈ విషయాలన్నీ తెలిసుండాలి’ అంటూ స‌ల‌హా ఇచ్చే పేరుతో ఓవ‌రాక్ష‌న్ చేశారు.
దీనికి ఒళ్లు మండిన సానియా.. కాస్తంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. త‌న కుమారుడ్ని ఎలాంటి బార్ కు తీసుకెళ్ల‌లేద‌ని.. అయినా ఈ విష‌యాల‌న్ని మీకు అన‌వ‌స‌రం అంటూ మండిప‌డ్డారు. నేను నా బిడ్డ‌ను ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకుంటానో త‌న‌కు మాత్ర‌మే తెలుస‌ని వ్యాఖ్యానించారు.
"వీణా.. మీరు మ‌రో విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. పాక్ క్రికెట‌ర్లు ఏం తింటారు? ఎప్పుడు నిద్ర‌పోతారు లాంటి విష‌యాల్ని ప‌ట్టించుకోవ‌టానికి నేనేమీ పాక్ క్రికెట్ టీం డైటీషియ‌న్ ను కాను. వారి తల్లిని కాదు. ప్రిన్సిప‌ల్ ను కూడా కాదు. టీచ‌ర్ ని అంత‌క‌న్నా కాదు. ఏది ఏమైనా మీరు మా ప‌ట్ల చూపుతున్న శ్ర‌ద్ధ‌కు ధ‌న్య‌వాదాలు. కొంద‌రు నెటిజ‌న్లు ఇలాంటి ట్వీట్లు చేస్తూ పిచ్చెక్కిస్తుంటారు. మీ ఫ‌స్ట్రేష‌న్ ను పోగొట్టుకోవ‌టానికి ఇత‌ర మార్గాలు ఎంపిక చేసుకోండి" అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్ని ప్ర‌స్తావించి ఉన్న కొద్దిపాటి గౌర‌వాన్ని ఎందుకు పోగొట్టుకుంటారో వీణామాలిక్ లాంటి వారికే తెలియాలి.