క్లారిటీ వచ్చేసింది.. రిలీజ్ డేట్ పోస్టర్లు వచ్చేశాయి

May 26, 2020

సంక్రాంతి అంటేనే.. బడా హీరోల సినిమాలు విడుదల మామూలే. పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే వేళలో.. పోటీ ఉండటం.. థియేటర్ల కోసం పడే తిప్పలు.. తమ సినిమా ముందంటే.. తమ సినిమాను ముందు విడుదల చేయాలన్న పోటీ మామూలే. ఇలాంటివేళ.. చర్చలతో ఇష్యూను ఒక కొలిక్కి తీసుకొస్తారు. ఈ సంక్రాంతి రేసులో మహేశ్ ‘సరిలేరునీకెవ్వరూ’.. బన్నీ‘అల వైకుంఠపురములొ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ రెండు సినిమాల్ని తొలుత ఒకే రోజున విడుదల చేయాలని భావించినా.. అలా చేస్తే నష్టపోయే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో.. రాజీ ఫార్ములాతో రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేశారు. అయితే.. థియేటర్ల విషయంలోనూ.. రిలీజ్ తర్వాత  ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు కేటాయించాలన్న అంశం మీద రెండు సినిమా యూనిట్ల మధ్య చర్చ రచ్చగా మారినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ వాదనకు బలం చేకూరేలా సెన్సార్ పూర్తి అయిన తర్వాత కూడా రిలీజ్ డేట్స్ ను ప్రకటించకుండానే పోస్టర్లు విడుదల చేయటంతో రకరకాల వాదనలు వినిపించాయి. ముందు అనుకున్న దాని కంటే రెండు రోజుల ముందు బన్నీ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో.. వాతావరణం మరింత వేడెక్కింది. ఇలాంటివేళ.. రెండు సినిమాల విడుదల మీద వస్తున్న ఊహాగానాలకు తెర దించేందుకు వీలుగా రెండు సినిమాల నిర్మాతలు రంగంలోకి దిగారు.
తొలుత అనుకున్నట్లుగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని జనవరి 11న.. అల వైకుంఠపురం చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించటమే కాదు.. సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. దీంతో.. ఈ రెండు సినిమాల రిలీజ్ కు సంబంధించి ఇప్పటివరకూ నడిచిన కన్ఫ్యూజన్ ఒక కొలిక్కి వచ్చి క్లారిటీ వచ్చేసినట్లుగా చెప్పాలి. అదేదో కాస్త ముందే  రిలీజ్ పై ఒక నిర్ణయం తీసుకొని ఉంటే.. అనవసరమైన ఊహాగానాలకు విస్తరించకుండా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.