అమ్మా నీకు వందనం.. సలాం చేసేలా సంతోష్ తల్లి మాటలు

August 10, 2020

కని.. పెంచి.. ప్రయోజకుడైన కొడుకు జీవిత చరమాంకంలో తమకు తోడునీడగా ఉంటారని ఆశిస్తారు. అలాంటివేళ.. కడుపుకోతను మిగిల్చేలా.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే.. ఆ శోకాన్ని మాన్చటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అలాంటి వేదనలో ఉన్నారు కర్నల్ సంతోష్ తల్లి మంజుల.

సరిహద్దుల్లో చైనాతో చోటుచేసుకున్న తాజా ఘర్షణలో సంతోష్ బాబు వీర మరణం పొందటం తెలిసిందే.
కొడుకు మరణవార్తను కాస్త ఆలస్యంగా తెలుసుకున్న ఆమె ఆవేదనను విన్నోళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

దేశం కోసం తన కొడుకు ప్రాణాలు విడవటంపై ఆమె స్పందన పలువురిని కదిలించివేస్తోంది. దేశం కోసం తన కొడుకు ప్రాణాలు అర్పించటం గర్వంగా ఉందన్న ఆమె.. తన కొడుకు గురించి చెప్పుకొచ్చారు.

‘‘నా కొడుకు ఎంతో ధైర్యవంతుడు. చాలా తెలివైనవాడు. సున్నిత మనస్కుడు. కుటుంబ బంధాల విలువ అతనికి బాగా తెలుసు. అందరితోనూ కలివిడిగా ఉంటాడు. ఎప్పుడూ మా ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటాడు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. నేను ఇబ్బంది పడితే అస్సలు తట్టుకోలేడు. అప్పుడప్పుడు వంటిట్లోకి వచ్చి సాయం చేస్తాడు’’ అని చెప్పుకొచ్చారు.

తల్లిగా తన కొడుకు మరణం తనకు వేదన కలిగిస్తున్నా.. దేశం కోసం తన కొడుకు ప్రాణాలు అర్పించటం మాత్రం గర్వంగా ఉందన్న సంతోష్ తల్లి మంజుల మాటలు విన్నోళ్లంతా భావోద్వేగంతో కదిలిపోతున్నారు.

ఆదివారం రాత్రి పది గంటల సమయంలో సంతోష్ తమతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ మధ్యనే హైదరాబాద్ కు బదిలీ అయ్యిందని.. లాక్ డౌన్ కారణంగా రాలేదన్నారు. ఎలా ఉన్నారని అడిగి.. తానుకాస్త బిజీగా ఉన్నానని.. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పారని.. అదే తన కొడుకు చివరి మాటలుగా ఆమె గుర్తుకు తెచ్చుకొని రోదిస్తున్న వైనం అందరిని కదిలించి వేస్తోంది.