చీర కట్టిన ట్విట్టరు !

August 02, 2020

కొత్తొక వింత, పాతొక రోత అనే సామెత ఈకాలానికి చాలా బాగా సరిపోతుంది. దేన్నయినా సెలబ్రేట్ చేయమంటే...పోలో మంటూ ఫాలో అయిపోతారు జనం. సెలబ్రేషన్స్ కు ఇప్పటి జమానా ఎపుడూ రెడీగా ఉంటుంది. తాజాగా ’శారీ ట్విట్టర్‘ ట్రెండింగ్ అవుతోంది. మొన్న మొదలైన ఈ ట్రెండ్ ట్విట్టరులో అమ్మాయిలకు పిచ్చిక్కెచ్చింది. 

చీర అంటే ఇష్టపడిన అమ్మాయి ఉంటుందా? మోస్ట్ లవబుల్, మోస్ట్ సెక్సీయెస్ట్, మోస్ట్ మోడరన్ డ్రెస్ ఏదైనా ఉందంటే... అది చీరే. అందుకే చీర పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తన ప్రభ కోల్పోలేదు. ఎన్ని ట్రెండ్లు మారినా చీర ట్రెండ్ మారలేదు. అందుకే దానిని సెలబ్రేట్ చేసుకుంటోంది ట్విట్టరు. ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ చీర కట్టిన ఫొటోలు పెట్టి మురిసిపోతున్నారు. చీరలో సింగారించుకున్న మగువలు కొన్ని లక్షల ఫొటోలతో ట్విట్టరును ముంచెత్తారు. 

ముఖ్యంగా ఈ ట్రెండులో పలువురు ప్రముఖులు ఉండటం విశేషం. హైదారబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా చీర కట్టిన ఫొటోలు పెట్టారు. ప్రియాంక గాంధీ చీరలోని తన పెళ్లి ఫొటోను పెట్టింది. ఐపీఎస్ రూప, ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నిధి, నటి గుల్పనాగ్, ఇజ్రాయిల్ డిప్లమాట్ (ఇండియా) మాయ కడోష్, బర్కాదత్, పలువురు నటీమణులు, వ్యాపారులు ఈ ట్రెండ్ లో పాల్గొనడం విశేషం. పలువురు విదేశీయులు కూడా ఈ శారీ ట్విట్టరు ట్రెండులో మురిసిపోయారు.