మాల్ లో పాక్ కెప్టెన్ కు ఘోర ప‌రాభ‌వం!

August 03, 2020

ప్ర‌పంచ క‌ప్ లో టీమిండియా చేతిలో దారుణ ఓట‌మి త‌ర్వాత నుంచి పాక్ జ‌ట్టు కెప్టెన్ కు.. జ‌ట్టు స‌భ్యుల‌కు ఇబ్బందులు పెరిగాయి. పాక్ కెప్టెన్ స‌ర్ప‌రాజ్ ప‌రిస్థితి దారుణంగా మారింది. అత‌న్ని అదే ప‌నిగా మాట‌లు అనే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్న అత‌గాడు త‌న కుటుంబంతో స‌హా షాపింగ్ కోసం మాల్ కు వెళ్లిన సంద‌ర్భంగా ఒక ఎద‌వ లాంటి అభిమాని కార‌ణంగా చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్నాడు.
కొడుకును ఎత్తుకొని వెళుతున్న స‌ర్ప‌రాజ్ ను ఒకడు సెల్ఫీ ఇవ్వాల‌ని కోరాడు. అందుకు స‌ర్ప‌రాజ్ ఓకే చేశాడు. అయితే.. అత‌డు ఎత్తుకున్న కుమారుడు ఎడుస్తుండ‌టంతో ప‌క్క‌కు వెళ్లాడు. దాంతో అత‌గాడు దారుణ రీతిలో దుర్బాష‌లాడ‌టం మొద‌లెట్టాడు. స‌ర్ప‌రాజ్ భాయ్.. ఎందుక‌లా పందిలా బ‌లిసావ్.. కాస్త డైట్ చేయొచ్చుగా? అంటూ అభ్యంత‌ర‌క‌ర రీతిలో దుర్భాష‌లాడ‌టం షురూ చేశాడు. దీనికి ఎలాంటి స్పంద‌న లేకుండా కామ్ గా వెళ్లిపోయాడు స‌ర్ప‌రాజ్.
చేసిన ఘ‌న‌కార్యాన్ని వీడియోగా మార్చిన స‌ద‌రు వ్య‌క్తి ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై ప‌లువురు స‌ర్ప‌రాజ్ కు అండ‌గా నిలిచారు. గెలుపోట‌ములు ఆట‌లో స‌హ‌జ‌మ‌ని.. అంత మాత్రాన ప‌గ తీర్చుకున్నంత‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. ఒక గౌర‌వ ప్ర‌ద‌మైన వృత్తిలో ఉండి.. దేశం కోసం ప‌ని చేసే వారిని హీరోలుగా అనుకోవాలే త‌ప్పించి ఇలా కించ‌ప‌ర్చ‌టం స‌రికాద‌న్నారు. మ‌రికొంద‌రు కాస్త తీవ్రంగా రియాక్ట్ అవుతూ.. నీలాంటి వెధ‌వ‌ల జోలికి పోవ‌టం కంటే ప్ర‌శాంతంగా ఉండ‌టం మంచిద‌ని వాళ్ల‌మ్మ స‌ర్ప‌రాజ్ కు నేర్పించిందంటూ దుమ్మెత్తి పోశారు.
ఒక ప్రొఫెష‌న‌ల్ ఆట‌గాడిని అంత‌లా అవ‌మానిస్తావా? నువ్వు చేసింది సిగ్గుమాలిన చ‌ర్య అని ఒక‌రు వ్యాఖ్యానిస్తే.. నువ్వు చేసే నైన్ టు ఫైవ్ జాబ్ లో ఏదైనా త‌ప్పు చేస్తే.. అప్పుడు జ‌నాలు రోడ్ల మీద నిన్ను ఇలానే అవ‌మానిస్తే తట్టుకుంటావా? అని ప్ర‌శ్నించారు. ఆట‌లో త‌ప్పులు స‌హ‌జ‌మ‌ని.. ఒక ఆట‌గాడి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌టం ఆహ్వానించ‌టం స‌రికాద‌ని పేర్కొన్నారు. ఈ ఉదంతంపై స‌ర్ప‌రాజ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఏదో ఒక రోజు ఆట‌గాడు స‌హ‌నాన్ని కోల్పోతాడ‌ని.. అప్పుడు వాళ్లు స్పందించే విధానం వేరుగా ఉంటుంద‌ని.. ఇలాంటి వాటితో ఆట‌గాళ్లు అభిమానుల నుంచి దూరంగా ఉండాల్సి వ‌స్తుంది. మీరు అభిమానిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అని పేర్కొన్నారు.