సరిలేరు బ్లాక్‌బస్టర్ అని తేల్చేసింది

May 31, 2020

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చి చాలా కాలం అయిపోయింది. ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ లాంటి డిజాస్టర్ల తర్వాత ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో విజయాలు అందుకున్నప్పటికీ.. అభిమానులు ఆశించే మాస్ వినోదం వాటిలో లేకపోయింది. ఒక ‘పోకిరి, ఒక ‘దూకుడు’ తరహాలో అభిమానుల్ని వెర్రెత్తించే మాస్ మసాలా సినిమాను అతడి నుంచి ఆశిస్తున్నారు.

ఈ తరంలో కమర్షియల్ హిట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనిల్ రావిపూడి అయితేనే అభిమానులు కోరుకునే సినిమా ఇవ్వగలడని మహేష్ అతడితో జట్టు కట్టాడు. దీని కోసమే సుకుమార్ లాంటి దర్శకుడి సినిమాను కూడా పక్కన పెట్టేశాడు. మరి మహేష్-అనిల్ కలయికలో రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ అభిమానుల అంచనాల్ని అందుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఐతే చిత్ర బృందం ముందు నుంచి సినిమా బ్లాక్ బస్టర్ అంటోంది కానీ.. బయటి నుంచి ఎవరైనా సినిమా విషయంలో ఏం ఫీడ్ బ్యాక్ ఇస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ విషయంలో అభిమానులకు నచ్చే మాట చెప్పింది. ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ అని ఆమె తీర్పు ఇచ్చేయడం విశేషం. తాజాగా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ముగిసిన అనంతరం ప్యాకప్ షూట్ ఒకటి చేశాడు. అందులో పాతికేళ్ల కుర్రాడిలాగా చార్మింగ్‌గా కనిపించాడు సూపర్ స్టార్. ఈ ఫొటోను నమ్రత షేర్ చేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’ స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని తేల్చేయడం విశేషం. నమ్రత కాన్ఫిడెన్స్ చూసి అభిమానులు ‘సరిలేరు..’ మీద అంచనాలు మరింత పెంచేసుకుంటున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.