‘సరిలేరు నీకెవ్వరు’ రివ్యూ

May 29, 2020
నటీనటులు- మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన్నా, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు
సంగీతం-దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం-రత్నవేలు
నిర్మాతలు- అనిల్ సుంకర, దిల్ రాజు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి
 
స్టార్ హీరోల్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించే దర్శకులు అరుదు. పవన్ కళ్యాణ్ తనకు నప్పని క్యారెక్టర్లతో అభిమానుల్ని తీవ్ర నిరాశలో ముంచేస్తున్న సమయంలో హరీష్ శంకర్ వచ్చి ‘గబ్బర్ సింగ్’ సినిమా తీశాడు. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా కనిపించాడందులో. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’ లాంటి సినిమాల్లో అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. కంటెంట్ పరంగా వాటి సరసన చేర్చదగ్గ సినిమా కాదు కానీ.. మహేష్ అభిమానుల్ని మురిపించే విషయంలో మాత్రం వాటి సరసన చేర్చదగ్గ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.
వరుసగా ఉత్తముడైన హీరో పాత్రలతో.. విపరీతమైన క్లాసులు పీకే కథలతో ఒకరకమైన మూసలో కొట్టుకుపోతున్న మహేష్.. ఆ జోన్ నుంచి బయటికి వచ్చి చేసిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి తమ డిమాండ్లు తీర్చమని బెదిరించిన ఉగ్రవాదుల మీద ఎటాక్ చేసే ఎపిసోడ్లో కావచ్చు.. కర్నూలు కొండారెడ్డి బురుజు ముందు విలన్ల పని పడుతూ ‘భయపడేవాడే బేరాలాడతాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా’ అని డైలాగ్ పేల్చే యాక్షన్ ఘట్టంలో కావచ్చు.. విలన్ ఇంట్లోకి వెళ్లి అతడి మనుషులందరినీ ఉతికారేసి నిన్ను మంచోడిగా మారుస్తా అని సవాల్ చేసే సీన్లో కావచ్చు.. మైండ్ బ్లాంక్ పాటలో లుుంగీ ఎగ్గట్టి ఊర మాస్ స్టెప్పులు వేసేటపుడు కావచ్చు. మహేష్ అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకోకుండా ఉండవు. ఆయా సమయాల్లో వాళ్లు కుదురుగా కూర్చోలేరు. ఇలాంటి ఎపిసోడ్లు, స్టెప్పులు ఇంతకుముందు తెలుగు సినిమాల్లో చూడనివి కావు. కానీ మహేష్‌ను ఇలా చూడటం.. ప్రతి చోటా అనిల్ రావిపూడి మార్కు వినోదం తోడవడం ‘సరిలేరు నీకెవ్వరు’ను భిన్నంగా నిలబెడుతుంది.
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రోమోలు చూస్తేనే కథ మీద పెద్దగా అంచనాలు పెట్టుకోడకూడదన్న అభిప్రాయం ప్రేక్షకులకు వచ్చేసి ఉంటుంది. ఇందులో కొత్తదనం ఉంటుందని ఆశిస్తే కచ్చితంగా నిరాశ పడాల్సిందే. మరీ పలచనైనా, రొటీన్ కథను ఎంచుకున్న అనిల్.. స్క్రీన్ ప్లేలోనూ వైవిధ్యం ఏమీ చూపించలేదు. కానీ అతను కమర్షియల్ మసాలాలు మాత్రం బాగా కలిపాడు. ఎక్కడిక్కడ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు, మాస్ పాటలు ప్లేస్ చేయడం ద్వారా ‘సరిలేరు..’ను ఎంగేజింగ్‌గా మలిచాడు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఇంట్రో ఎపిసోడ్‌తోనే ఈ సినిమా ఎలా సాగుతుందన్నది అర్థమైపోతుంది. బాంబు డిఫ్యూజ్ చేయడం కోసం వచ్చిన హీరో.. ఒక కాఫీ చెప్పండంటూ తన మిషన్ మొదలుపెడతాడు. ఈ సీన్ చూశాక సినిమాలో దేన్నీ సీరియస్‌గా తీసుకోకూడదని.. లాజిక్కుల గురించి ఆలోచించకూడదని.. కథ మీద కంప్లైట్స్ ఉండకూడదని.. ప్రతి సీన్లోనూ, ఫైట్లోనూ, పాటలోనూ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మాత్రమే చూస్తూ దాన్ని ఆస్వాదించగలిగితే ఆస్వాదిస్తూ సాగిపోవాలని అర్థమైపోతుంది. ఈ కోణంలో చూస్తే ‘సరిలేరు..’ చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎంగేజ్ చేస్తుంది.
ఐతే అనిల్ రావిపూడి గత సినిమాలు చూసిన అనుభవంతో ‘సరిలేరు..’లో పేలిపోయే కామెడీ ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. హీరో ఎలివేషన్లతో సాగే కశ్మీర్ ఎపిసోడ్ తర్వాత వచ్చే ట్రెయిన్ ఎపిసోడ్ చిత్ర బృందం ఊదరగొట్టిన స్థాయిలో పేలలేదు. అక్కడక్కడా కొన్ని జోకులు ఓకే కానీ.. ఓవరాల్‌గా మాత్రం ఆ ఎపిసోడ్ అంత వినోదాత్మకంగా లేదు. ఐతే ఇంటర్వెల్ ముంగిట కొండారెడ్డి బురుజు నేపథ్యంలో సాగే యాక్షన్ ఘట్టంతో మళ్లీ ‘సరిలేరు..’ ట్రాక్ ఎక్కుతుంది. ఈ ఎపిసోడ్ ద్వితీయార్ధం మీద అంచనాలు పెంచేస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం అంచనాలకు తగ్గట్లు లేదు. అందుక్కారణం విలన్ పాత్రను కామెడీగా తయారు చేయడమే. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుందన్న ప్రాథమిక సూత్రాన్ని అనిల్ విస్మరించాడు. ఆ పాత్రను ఆరంభంలోనే తేల్చేయడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి లేకపోయింది. హీరో-విలన్ మధ్య తొలి కన్ఫ్రంటేషన్ సీన్ బాగున్నప్పటికీ అక్కడే విలన్ పాత్ర గాలి తీసేయడంతో ప్రేక్షకులు చల్లబడిపోతారు. అక్కడి నుంచి క్లైమాక్స్ కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. 
విలన్‌తో పోలిస్తే విజయశాంతి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. అయినప్పటికీ అది ఆమే చేయాల్సిన పాత్ర మాత్రం కాదు. ఐతే పూర్తిగా ప్రేక్షకులు చల్లబడిపోతున్న సమయంలో ‘మైండ్ బ్లాంక్’ పాట వచ్చి మళ్లీ ఉత్సాహం తీసుకొస్తుంది. భారీ క్లైమాక్స్ ఆశిస్తే.. దానికి భిన్నంగా సరదాగా ముగింపు సన్నివేశాల్ని నడిపించి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని దర్శకుడు అనుకున్నాడు కానీ.. అది అంతగా వర్కవుట్ కాలేదు. సినిమాలో మహేష్‌ది వన్ మ్యాన్ షో. అతను హైలైట్ అయినంతగా దర్శకుడు అనిల్ రావిపూడి హైలైట్ కాలేదు. అతడి మార్కు వినోదం లేకపోవడం బలహీనత. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి చెప్పేదేమీ లేదు. రత్నవేలు ఛాయాగ్రహణం ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఓకే.  ఓవరాల్‌గా చూస్తే కొత్తగా ఏమీ ఆశించకుండా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ మెప్పిస్తుంది. అంతకుమించి ఆశిస్తే నిరాశ తప్పదు.
 
రేటింగ్- 3/5