ఆంధ్రోళ్ల మీద భారీ సటైర్.. సోషల్ మీడియాలో వైరల్

April 04, 2020

నేను ఆంధ్రోడ్ని అంటూ గొప్పగా చెప్పుకునే స్థానం నుంచి.. నేను తెలుగోడ్ని అంటూ తన ఉనికిని చెప్పుకునేందుకు సైతం సందేహ పడిపోతున్న తీరు ఆంధ్రోళ్లలో అంతకంతకూ ఎక్కువ అవుతుందంటున్నారు. వరుస పెట్టి పాలకులు.. మేధావులు చేస్తున్న తప్పులకు ఆంధ్రోళ్లు ఇలాంటి శిక్ష తప్పటం లేదు. ఇంతకీ ఆంధ్రోళ్లకు వచ్చిన పెద్ద కష్టం ఏమంటే.. తమ ఉనికిని చాటుకునే విషయంలో వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారట.
తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు చేస్తున్న ఎటకారం.. వాస్తవానికి దగ్గర్లోనే ఉందంటున్నారు. ఆంధ్రోళ్ల రాజధాని ఏది? అన్న ప్రశ్నకు బదులుగా.. వాళ్లదో సంచారజాతి.. వారికంటూ రాజధాని లేదు. భవిష్యత్తులో కూడా రాదంటూ తేల్చేసిన వైనం చూస్తే.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని.. విడిపోయిన తెలంగాణతో కలిసిన అప్పటి రోజును డిసైడ్ చేసుకోవటంలోనే ఆంధ్రా పాలకుల తెలివి ఎంతన్నది అర్థమయ్యే పరిస్థితి. ఛీ కొట్టి.. వనరుల్ని.. ఉద్యోగాల్ని దోచుకున్నారన్న ముద్ర వేయించుకొని మరీ విడిపోయిన ప్రాంతంతో అప్పుడెప్పుడో కలిసిన రోజును ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చేసుకోవటం ఏమిటన్నది అర్థం కాని ప్రశ్న. ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్ అవతరణకు మరో మంచిరోజు అంటూ ఏదీ ఉండదా? అన్న సందేహానికి సమాధానం లభించని దుస్థితి.
అవతరణ విషయంలోనే కాదు.. రాజధాని విషయంలోనూ ఇలాంటి సస్పెన్స్ నెలకొనటం చూస్తున్నదే. మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు చెన్నైగా.. సొంత రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కర్నూలుగా రాజధానిని చేసుకొని.. హైదరాబాద్ రాష్ట్రంతో కలిసినప్పుడు హైదరాబాద్ ను రాజధానిగా ఓకే చేసుకున్న ఆంధ్రోళ్లకు.. నేటికీ రాజధాని ఎక్కడన్నది సందేహమే. అమరావతిని ఏపీ రాజధానిగా డిసైడ్ చేసిన చంద్రబాబు వందేళ్ల కల కన్నాడు. కానీ... జగన్ ప్రభుత్వం దాంతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తోంది.
ఏపీ రాజధాని అమరావతి అయితే కాదన్న రీతిలో ఇటీవల ఆ ప్రభుత్వంలోని మంత్రి బొత్స చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. మరేది రాజధాని అంటే.. మరో కమిటీని వేశారు. జగన్ అనుసరించిన విధానాన్ని రేపొద్దున వచ్చే పాలకులు ఫాలో అవుతారన్న గ్యారంటీ లేదు. బాబు రాజధాని అమరావతిగా.. జగన్ రాజధాని మరొకటిగా అయినప్పుడు.. వీరిద్దరూ కాకుండా ఇంకెవరి చేతుల్లోకైనా పవర్ వెళితే.. వారో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తారా? అన్నది ప్రశ్న. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుకు తగ్గట్లే.. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకునే సంచార జాతిగా ఆంధ్రోళ్లు మిగిలిపోతారా? వారికంటూ ఒక రాజధాని స్థిరంగా ఎప్పటికి ఉండదా? అన్నదిప్పుడు సందేహంగా చెప్పక తప్పదు.