యావ‌త్ మీడియాకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన మోడీ! 

July 12, 2020

మోడీ మ‌జాకానా? అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే ఆయ‌న మోడీ ఎందుకు అవుతారు. త‌న‌ను తాను సామాన్యుడిలా.. తానో టీ అమ్మిన వ్య‌క్తిగా చెప్పుకుంటూనే.. తానెంత రేర్ పీస్ అన్న విష‌యాన్ని మోడీ అదే ప‌నిగా చెప్ప‌టం క‌నిపిస్తుంది. దేశ ప్ర‌ధానిగా ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో ఒక్క‌సారి కూడా మీడియా మీట్ పెట్ట‌ని పీఎంగా ఆయ‌న నిలిచిపోతారు. చేతికి అధికారం వ‌చ్చిన ఐదేళ్ల త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజున ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. త‌న మీడియా మీట్ లో యావ‌త్ మీడియాకు దిమ్మ తిరిగిపోయేలా మోడీ షాకిచ్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తాను ఎంపిక చేసుకున్న మీడియా ప్ర‌తినిధుల‌కు.. ష‌ర‌తుల‌తో కూడిన ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఆయ‌నిచ్చిన ఇంట‌ర్వ్యూల‌న్ని వ్యూహాత్మ‌క‌మైన‌వి.. ప‌క్కా ప్లానింగ్ తోనే త‌ప్పించి.. రోటీన్ వి కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం మీడియా స‌మావేశం ఉంద‌న్న విష‌యాన్ని బీజేపీ బీట్ రిపోర్ట‌ర్ల‌కు స‌మాచారం అందించారు. ఎప్ప‌టిలానే బీజేపీ చీఫ్ అమిత్ షా హాజ‌రవుతార‌న్న స‌మాచారం అందులో ఉంది.
అయితే.. అనూహ్యంగా ప్రెస్ మీట్ స్టార్టింగ్ లో అమిత్ షాతో పాటు న‌రేంద్ర మోడీ మీడియా ముందుకు వ‌చ్చి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. తాను ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న‌కు తానుగా నేరుగా మీడియా మీట్ కు మోడీ రావ‌టం ఇదే తొలిసారి అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. దీంతో మోడీకి ప్ర‌శ్న‌లు సంధించేందుకు విలేక‌రులు ఉత్సాహ‌ప‌డినా.. వారి ఉత్సాహం మీద మోడీ త‌న‌దైన స్టైల్లో నీళ్లు పోశారు.
తాను క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన సైనికుడిన‌ని.. పార్టీ అధ్య‌క్షుడు ఉన్న వేళ‌.. ఆయ‌నే స‌మాధానాలు ఇస్తార‌ని.. తాను మాట్లాడ‌న‌న్న మోడీ.. అందుకు త‌గ్గ‌ట్లే త‌న‌ను ఉద్దేశించి అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు షా చేత‌నే స‌మాధానం ఇప్పించారు.
ఇన్ని మాట‌లుచెప్పిన పెద్ద మనిషి అదే అధ్య‌క్షుల వారి ముందు మీడియాకు తాను చెప్పాల్సిన విష‌యాల్ని తాను చెప్పేసి ఉండిపోయారు. మీడియాకు మోడీ చెబుతారు కానీ.. మోడీని మీడియా ఏమీ అడ‌గ‌లేర‌న్న విష‌యాన్ని త‌న తాజా చ‌ర్య‌తో చెప్పేశార‌ని చెప్పాలి. మోడీనా మ‌జాకానా!