ఏపీ సీఎస్ కి... ఈసీ రివర్స్ షాక్ అదిరింది

June 03, 2020

ఏపీలో స్థానిక ఎన్నికల్ని ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. వాస్తవానికి ఆయన నిర్ణయం కంటే కూడా.. వాయిదాపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు.. చేసిన ఘాటు ఆరోపణలు.. విమర్శలు.. ఈ ఇష్యూను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇలాంటివేళ.. ఏపీ ఎన్నికల కమిషనర్ కు రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని మూడు పేజీల లేఖ రాశారు. అందులో పలు అంశాల్ని ప్రస్తావించారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజాగా ఆమె లేఖకు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. ఆయన కూడా మూడు పేజీల లేఖతో సమాధానం ఇచ్చారు. ఎన్నికల్ని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో వివరంగా వెల్లడించటంతో పాటు.. ఎన్నికల వాయిదా కారణంగా కేంద్రం నిధులు రాకుండా పోతున్న వైనం పైనా.. పలు ఆరోపణల మీద ఆయన సమాధానాలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
తనపై చేసిన ఆరోపణలకు ఆయన ఇచ్చిన సూటి సమాధానం చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ లో పడే పరిస్థితి నెలకొందన్నమాట వినిపిస్తోంది. తనకున్న అనుభవాన్ని.. తన సీనియార్టీని.. ఆర్థిక అంశాల మీద తనకున్న పట్టును ఆయన తన లేఖలో అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. ఇంతకూ ఆయన తన మూడు పేజీల లేఖలో ఏమేం అంశాల్ని పేర్కొన్నారంటే..?
%  గతంలో రాజ్ భవన్ లో ఫైనాన్స్ వ్యవహారాలు చూశా. రాజ్ భవన్ కంటే ముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉంది. ఎన్నికలను వాయిదా వేసినందుకు ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్ని నిర్వహిస్తేనే నిధులు వస్తాయన్న నిబంధన తెలుసు. గతంలో చాలా సందర్భాల్లో ఎన్నికలు నిలిపివేసినా కేంద్ర నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
%  ఎన్నికలకు.. ఆర్థిక సంఘం నిధులకు లింకు పెట్టవద్దు. కరోనా ప్రభావంతోనే ఎన్నికల్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఏపీలోనే కాదు.. మహారాష్ట్ర.. పశ్చిమ బెంగాల్.. ఒడిశాలలోనూ స్థానిక ఎన్నికల్ని వాయిదా వేశారు.
% గోవాలోనూ ఎన్నికల్ని వాయిదా వేసే అంశాన్ని చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించిన గ్రాంట్లు.. నిధుల విడుదల విషయంలో అవగాహన ఉంది.
%  ఏపీ ఆరోగ్య శాఖతో కరోనా ప్రభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశా. కానీ.. ఆ శాఖ బిజీగా ఉండటం వల్ల సమాచారం అందించలేకపోయిందనుకుంటా. ఈ క్రమంలో మీ నుంచి లేఖ వచ్చింది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. సంతోషం. కాకపోతే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారి ప్రకటించింది. ఈ వైరస్ భారత్ లోకి రెండో దశలోకి ప్రవేశించింది.
% ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికల్ని ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నాం. అదే సమయంలో ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు మా వంతు సహకారం అందిస్తాం. అవసరమైన డాక్యుమెంట్లు అందిస్తాం.
% ఎన్నికల వాయిదా అంశాన్ని ప్రకటించే ముందు కేంద్ర ఆరోగ్య.. కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపా. వారి సూచనలు.. హామీతో ఎన్నికలు వాయిదా వేశా. రాష్ట్ర ప్రయోజనాల కారణంగానే ఎన్నికల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుున్నా.
% వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే ఆరు వారాల కంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం. ఎన్నికలకు.. ఆర్థిక సంఘం నిధులకు ముడి పెట్టొద్దు.అపార్థాలకు తావులేకుండా ఉండేందుకే ఈ లేఖ రాస్తున్నా.