వాస్తు కోసం... చరిత్రను కూల్చేసిన సీఎం

August 07, 2020

సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత.. నగరమంతా నిద్రలో జోగుతున్న వేళ.. సచివాలయం పరిసరాల్లో మాత్రం హడావుడిగా ఉంది. పోలీసుల వాహనాలతోపాటు.. అధికారుల హడావుడి.. అనుకున్న పనులు అనుకున్న రీతిలో షురూ చేసేందుకు వీలుగా హడావుడి సాగుతోంది. సచివాలయాన్ని కూల్చి వేసి.. దాని స్థానంలో కొత్తది నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొద్దికాలంగా అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే.. ఈ భవనాల్ని నెలల క్రితమే ఖాళీ చేశారు. కోర్టు కేసుల పుణ్యమా అని ఇప్పటివరకూ కూల్చివేయకుండా ఆపేశారు.
ఇటీవల రాష్ట్ర హైకోర్టు రియాక్టు అవుతూ.. సచివాలయాన్ని కూల్చి వేసేందుకు అనువుగా తన తీర్పును వెల్లడించటం తెలిసిందే. దీంతో.. సచివాలయ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే.. ఈ భారీ భవన సముదాయాన్ని ఎలా కూల్చాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరికొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుందన్న అంచనాలకు భిన్నమైన పరిస్థితులు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్నాయి.
సచివాలయ భవన నిర్మాణాల్ని కూల్చివేయాలని ప్రభుత్వం అనుకోవటంతో.. దీనికి సంబంధించిన పనులు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత.. మంగళవారం తెల్లవారుజామున మొదలైనట్లుగా చెబుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా.. సమాచారం బయటకు పొక్కకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. కూల్చివేత నిర్ణయానికి సంబంధించిన ఆదేశాల్ని అధికారికంగా బయటపెట్టకుండా.. గుట్టుచప్పుడుకాకుండా మొదలైన కూల్చివేతల పర్వం చూస్తే.. కేసీఆర్ కలల పంటకు తొలి అడుగు పడిందని చెప్పక తప్పదు.