గ్యాంగ్ వార్ : సందీప్ భార్య చెప్పిన రహస్యాలు ?

August 05, 2020

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది బెజవాడ గ్యాంగ్ వార్. తొలుత స్టూడెంట్స్ లొల్లి అనుకున్నా.. తర్వాత దీనికి సంబంధించి బయటకు వస్తున్న నిజాలు షాకింగ్ గా మారాయి. రెండు వర్గాలు ఒకరినొకరు చంపుకునే వరకూ వెళ్లేంత వీరి మధ్య శత్రుత్వం ఏముంది? కత్తులు.. కర్రలు పట్టుకొని కనిపిస్తే ఏసేయాలన్న కసి ఎందుకు వచ్చింది? అన్న విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా హతుడు తోట సందీప్ సతీమణి తేజస్విని ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాల్ని వెల్లడించారు.
భూవివాదంతో సందీప్ కు సంబంధం లేదని.. తన భర్తను పక్కా స్కెచ్ వేసి చంపినట్లుగా తేజస్విని ఆరోపిస్తున్నారు. సందీప్ హత్య వెనుక రాజకీయ కోణం ఉంటుందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. కొందరు రాజకీయ నేతలకు ఈ హత్య వెనుక సంబంధం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సందీప్ పోటీ చేయాలని భావించినట్లు తేజస్విని వెల్లడించారు.
సందీప్ వెంట తిరిగే పండూ.. తన భర్తను అన్నా.. అన్నా అంటూ వెంట తిరిగేవాడని ఆమె చెప్పారు. గ్యాంగ్ వార్ జరగటానికి ఒక రోజు ముందే తన భర్తను పండూ ఫోన్లో బెదిరించాడని ఆమె చెప్పారు. తర్వాత పండూ మరోసారి ఫోన్ చేయటం.. సందీప్ ఎత్తకపోవటంతో తమ షాపు వద్దకు వెళ్లి అక్కడి గుమస్తాపై దాడికి దిగినట్లు చెప్పారు. నీ కుటుంబాన్ని అంతం చేస్తామని పండూ హెచ్చరించేవాడన్నారు.
మాట్లాడుకుందామని పిలిచి.. హత్యకు ప్లాన్ చేశాడని చెప్పారు. అందులో భాగంగానే తన భర్తను దాడి చేసి చంపారని ఆమె ఆరోపించారు. సందీప్ హత్యకు పండు.. ప్రభు.. ప్రశాంత్.. బుల్లి అనే వారు కారణంగా ఆమె చెబుతున్నారు. తాను.. తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న తేజస్వినీ.. తన భర్తను చంపిన వారికి కఠిన శిక్షలు పడాలన్నారు. ఇప్పటివరకూ గ్యాంగ్ వార్ గా ఉన్న ఈ ఉదంతం.. తేజస్విని తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్ని ఉలిక్కిపడేలా చేసింది.