సీక్రెట్స్ ఆఫ్ మనీ: ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు మటాష్

August 04, 2020

నేటి కాలంలో డబ్బులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు డబ్బును ఆదా చేయాలనుకుంటారు. అనవసర విషయాల్లోను ఖర్చులు చేసి జేబులు గుల్ల చేసుకుంటారు. కొంతమంది తక్కువ సంపాదనతోను టెన్షన్ లేని జీవితం గడుపుతుంటారు. మరికొంతమంది ఎక్కువ వేతనం ఉన్నప్పటికీ ఎప్పుడు డబ్బులు చేతిలో ఉన్నట్లుగా కనిపించదు. దీనికి ప్రధాన కారణం మనీ మేనేజ్‌మెంట్. డబ్బులు ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎలా ఖర్చు చేయాలో తెలియాలి. ఓ పద్ధతి ప్రకారం ప్రణాళికతో డబ్బును వాడుకోవడం ముఖ్యం. మనీ విషయంలో ఎక్కువమంది చేసే పొరపాట్లు కొన్ని ఉంటాయి. అవేమిటో నమస్తేఆంధ్ర.కాం మీకు వివరిస్తుంది. 

1. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు: కొంతమంది తమకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఎక్కువగా నగరవాసులు, యువత, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు ఇలా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ. అర్భాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు వచ్చే వేతనం కంటే ప్రతి నెల అధికంగా ఖర్చు చేస్తారు. అవసరం ఉన్నాలేకపోయినా.. ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇది మానుకోవడం మంచిదని నమస్తేఆంధ్ర.కాం సలహా.

2. నెవర్ ఎండింగ్ పేమెంట్స్: ఉదాహరణకు సుదీర్ఘ కాలం ఉండే హోమ్ లోన్ వంటి వాటిని నెవర్ ఎండింగ్ పేమెంట్స్‌గా చెప్పవచ్చు. మన ఉద్యోగం ఎంత వరకు సురక్షితం, మన రాబడి ఏ మేరకు ఉంటుంది, మన లోన్ ఉన్నంత కాలం దీనిని ఎలాంటి భయం లేకుండా కట్టగలమా అని అంచనా వేసుకున్న తర్వాత ఇలాంటి వాటికి మొగ్గు చూపడం మంచిదని నమస్తేఆంధ్ర.కాం చెబుతోంది.

3. ఆదా చేయకపోవడం: కొంతమంది హైఫై జీవితం కోసం తనకు వచ్చే వేతనం కంటే ఎక్కువ ఖర్చులు చేస్తుంటారు. దీని కోసం అప్పులు చేస్తుంటారు. అప్పుల మీద జీవించడం అత్యంత అవసరమైతే చేయడం సరికాదు. మనకు వచ్చే వేతనంలో 30 శాతం లేదా 40 శాతం ఖర్చులు, కొంత మొత్తం భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడం మంచిది. చాలామంది ఆదా చేయడానికి ఆసక్తి చూపించరు. దీనిని మానుకోవడం మంచిదని మా అభిప్రాయం.

4. క్రెడిట్ కార్డ్: క్రెడిట్ కార్డు ఇప్పుడు సాధారణమైంది. ఎలాగూ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తుంటారు. క్రెడిట్ కార్డు లేకుంటే ఒక వ్యక్తి చేసే ఖర్చులు చాలా మేరకు తగ్గిపోతాయని నిపుణుల అభిప్రాయం. క్రెడిట్ అవసరమే కానీ బడ్జెట్ ప్లాన్ ఉండాలన్నది నమస్తే ఆంధ్ర.కాం సలహా.

5. కారు కొనుగోలు: మనకు మార్కెట్లో కొత్త కారుతో పాటు పాత కార్లు కూడా దొరుకుతాయి. అలాగే రేంజ్‌ను బట్టి కార్లు ఉంటాయి. కానీ బయట సమాజం కోసం మన తాహతుకు మించి కారు కోసం ఖర్చు చేయడం మంచిది కాదు. ఉదాహరణకు ఓ వ్యక్తికి రూ.4 లక్షలకు వచ్చే సెకండ్ హ్యాండ్ కారు కూడా ఉపయోగపడుతుంది. కానీ అతను కొత్త కారు కొనుగోలు చేస్తే రూ.10 లక్షల కారు.. ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ అన్నీ కలిపి రూ.14 లక్షలు రూ.15 లక్షల వరకు వస్తుంది. ఐదారేళ్లకు దానిని అమ్మితే రూ.4 లేదా రూ.5 లక్షలు కూడా రావడం కష్టం. అంటే రూ.9 లక్షల నుండి రూ.10 లక్షల మొత్తం మీ ఐదేళ్ల కాలంలో నష్టపోయారు. సెకండ్ హ్యాండ్ కారు మనకు ఉపయోగపడుతుందనుకుంటే కొనుగోలు చేస్తే వచ్చే నష్టమేమీ లేదు. ఆర్భాటాల కోసం కొత్త కారును ఫైనాన్స్‌లో కొనడం సరికాదు. అవసరమైతే కొనుగోలు చేయవచ్చు.

6. అప్పులో కొనుగోళ్లు : క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని మొబైల్ ఫోన్లు, ఇష్టం వచ్చినట్లు ల్యాప్‌ట్యాప్స్ ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తారు. ఎలిజిబులిటీ ఉందని లోన్ తీసుకొని అవసరం లేకున్నా ఇష్టారీతిన కొనుగోలు చేయకపోవడమే మంచిది. క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయవచ్చు కదా అని ఆరు నెలలకు ఓసారి ఫోన్ మార్చేవారు ఉంటారు. అప్పు చేసి వ్యాల్యూ తగ్గిపోయే వస్తువులు కొనుగోలు చేయడానికి దూరంగా ఉండాలి.

7. బడ్జెట్ ప్లాన్: ప్రతి వ్యక్తికి బడ్జెట్ ప్లాన్ చాలా ముఖ్యం. ప్రతి నెల మనకు వచ్చే వేతనం ఎంత, మనకు ఉన్న ఖర్చులు ఎన్ని, ఎలా ఖర్చు చేయాలి, ఎంత ఆదా చేయవచ్చు అనే విషయాలు తప్పనిసరి.

8. ఫైనాన్షియల్ ప్లానింగ్: మీ ఖర్చుల ఆధారంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఉదాహరణకు మీకు వచ్చే వేతనంలో సగం మొత్తాన్ని ఇంటి కిరాయి, మీ పెట్రోల్ ఖర్చు, ఈఎంఐలు, ఇంటి ఖర్చులు వంటి వాటి కోసం పెట్టుకోవాలి. ఓ ముప్పై శాతం సేవింగ్స్ చేయాలి. 20 శాతం ప్లాట్ కొనుగోలు చేయడం వంటి వాటికి ఉపయోగించడం మంచిది.

9. సేఫ్టీ ఫండ్ లేదా ఎమర్జెన్సీ ఫండ్: ప్రస్తుత కాలంలో సేఫ్టీ ఫండ్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. మనకు వచ్చే వేతనంలో ప్రతి నెల కొంత మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవాలి. ప్రస్తుత కాలంలో ఇది తప్పనిసరి.

10. తాహతుకు మించిన కొనుగోళ్లు:  మన తాహతుకు మించి ఈఎంఐతో పాటు అప్పులు చేసి ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొనుగోలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. మనం ఎంత వరకు బేర్ చేయగలమో అంతే కొనుగోలు చేయాలి.

11. ఎక్కువ కాలం ఒక కంపెనీలో ఉద్యోగం : ఓ కంపెనీలో ఎక్కువ కాలం పని చేశాక ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశాబ్దాలుగా అదే కంపెనీలో ఉంటే మీ వేతనం అంతకంతకూ పెరుగుతుంది. అప్పుడు కంపెనీ మీ బదులు నలుగురు ఫ్రెషర్స్ కోసం ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఒకే దగ్గర స్టక్ కాకుండా ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలి.

12. సెకెండ్ ఇన్‌కం: దాదాపు ప్రతి వ్యక్తికి ఇది కచ్చితమైనదని గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఒకే వేతనంపై ఆధారపడుతూ రెండో ఆదాయ మార్గాన్ని ఎంచుకోని వారు చాలామంది ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో అది సరికాదు. సెకండ్ ఇన్‌కం అంటే మరో ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. ఎక్కడో ప్లాట్ కొనుగోలు చేసి పక్కన పెట్టేస్తే కొన్నాళ్లకు దాని ధర కూడా పెరుగుతుంది. ఇది కూడా సెకండ్ ఇన్‌కం సోర్స్‌గా భావించవచ్చు. 

our previous items on money :

 

సీక్రెట్స్ ఆఫ్ మనీ: మీ డబ్బు పెరగలాంటే మీలో ఇది ఉండాలి

సీక్రెట్స్ ఆఫ్ మనీ: సంపన్నులు కావడానికి ఐడియాలు 

సీక్రెట్స్ ఆఫ్ మనీ: ఇలా కూడా మన డబ్బు పెరుగుతుందా?