రాయలసీమపై కేసీఆర్ ఇంత పగ ఉందా?

April 03, 2020

తెలుగు నేలలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా రాయలసీమనే చెప్పుకోవాలి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోనూ వెనుకబడిన ప్రాంతాలున్నా... రాయలసీమతో పోలిస్తే... కొంత బెటరేనని ఒప్పుకోక తప్పదు. అలాంటి రాయలసీమపై రాజకీయాల్లో ఉన్న ప్రతి నేత కూడా ప్రేమను ఒలకబోస్తూనే ఉంటారు. నేత నుంచి ఒలికే ప్రేమ... రాయలసీమను ఏ మేర అభివృద్ధి బాట పట్టించిందన్న విషయం.. రాయలసీమ ప్రస్తుత దృశ్యమే చెబుతోంది. ఇందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మినహాయింపేమీ కాదన్న వాదన ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చింది. రాయలసీమను సశ్యశ్యామలం చేద్దామంటూ గొప్ప ప్రకటనలు చేసిన కేసీఆర్... అసలు సీమకు కృష్ణా జలాలు ఇవ్వొద్దని, సీమకు కీలక ప్రాజెక్టులుగా భావిస్తున్న పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను తక్షణమే మూసివేయాలని ఏకంగా ట్రిబ్యూనళ్ల వద్ద వాదిస్తున్నారు. నిజమా? అంటే... నిన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు తెలంగాణ ఇదే వాదనను వినిపించింది. 

ఆ మధ్య  తమిళనాడులోని ఓ దేవుడి దర్శనం కోసం వెళ్లిన సందర్భంగా దారి మధ్యలో వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆహ్వానం మేరకు నగరిలోని ఆమె ఇంటికి వెళ్లిన కేసీఆర్... రోజా ఫ్యామిలీ ఆతిధ్యాన్ని స్వీకరించారు. ఆ సందర్భంగా రాయలసీమపై ప్రత్యేక ప్రేమ ఒలకబోసిన కేసీఆర్... రాయలసీమను సశ్యశ్యామలం చేస్తానని ఘనంగా ప్రకటించారు. పొరుగు రాష్ట్ర సీఎం.. అది కూడా సీమకు నీరు అడుగుపెట్టే ప్రాంతానికి సీఎంగా ఉన్న నేత నోట నుంచి ఆ మాట వినిపించేసరికి రోజా సహా రాయలసీమ రైతాంగం చాలా సంతోషపడ్డారనే చెప్పాలి. కేసీఆర్ తలచుకుంటే... నిజంగానే తెలంగాణ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కృష్ణా జలాలు అవసరమైన మేరకు అందితే... సీమ సశ్యశ్యామలమే కదా అని అంతా భావించారు. అయితే ఆ వ్యాఖ్యలు ఏదో అలా అదాటుగానే తన నోటి నుంచి వచ్చాయని, సీమపై తనకు ప్రేమ కాదు కదా... తీవ్రమైన పగ ఉందని తాజాగా కేసీఆర్ తన నిజ వైఖరిని నిరూపించుకున్నారు. 

ఆంధ్రా, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన వివాదాలపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యూనల్ వద్ద సోమవారం విచారణ జరగగా... తెలంగాణ తన వాదనను వినిపించింది. అసలు రాయలసీమలోని నాలుగు జిల్లాలు కృష్ణా పరివాహక ప్రాంతంలోనే లేవని సంచలన వాదన వినిపించిన కేసీఆర్ సర్కారు... సీమకు కృష్ణా జలాలను ఎలా ఇస్తారని నిలదీసినంత పనిచేసింది. అంతేకాకుండా సీమకు ఆయువుపట్టు అయిన పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను తక్ణణమే మూసివేయాలని కూడా డిమాండ్ చేసింది. సీమ మాదిరే ఎడారిగా ఉన్న ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుకు కూడా కృష్ణా జలాలను కేటాయించడానికి వీల్లేదని కూడా వాదించింది. అంతటితో ఆగని కేసీఆర్ సర్కారు.... కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సంపూర్ణ పర్యవేక్షణను తమకే కేటాయించాలని కూడా డిమాండ్ చేసింది. మొత్తంగా సీమపై తనకున్నది ప్రేమ కాదని పగేనని కూడా ఈ వాదనలతో కేసీఆర్ నిరూపించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.