టాక్ ఆఫ్ ద నేష‌న్‌.. ఆ అమ్మాయే

July 31, 2020

సీమ కుష్వాహా.. శుక్ర‌వారం ఉద‌యం నుంచి దేశ‌వ్యాప్తంగా ఈ అమ్మాయి గురించే చ‌ర్చ‌. ఏడేళ్ల కింద‌ట సంచ‌ల‌నం రేపిన నిర్భ‌య రేప్ కేసులో బాధితుల ప‌క్షాన వాదిస్తున్న లాయ‌ర్ ఈమే. నిర్భ‌య‌ను అత్యంత కిరాత‌కంగా హింసిస్తూ రేప్ చేసి ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నిందితుల త‌ర‌ఫున నిల‌బ‌డ్డ లాయ‌ర్లు ఎంత హేయ‌మైన వ్యాఖ్య‌లు చేశారో చూశాం. నిర్భ‌య ఆ రాత్రి స‌మ‌యంలో బ‌య‌ట తిర‌గ‌డం త‌ప్ప‌న్నారు. ఆమెను ప‌ట్టించుకోక‌పోవ‌డం త‌ల్లి త‌ప్ప‌న్నారు. అందుకు శిక్ష కూడా వేయాల‌న్నాడు చివ‌ర‌గా నిందితుల త‌ర‌ఫున వాదించిన లాయ‌ర్. ఈ న‌ర‌రూప రాక్ష‌సుల్ని కాపాడేందుకు.. ఉరి శిక్ష‌లు వాయిదా వేయించేందుకు చ‌ట్టంలో లొసుగుల్ని ఎలా వాడుకున్నారో.. ఎంత‌గా దిగ‌జారారో చూశాం.
ఇది నాణేనికి ఒక వైపు. రెండో వైపు చూస్తే.. నిర్భ‌య కోసం మొక్క‌వోని ప‌ట్టుద‌ల‌తో పోరాడింది సీమ‌. ఈ కేసు కోసం ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఉచితంగా కేసును వాదించింది. నిందితుల త‌ర‌ఫు లాయ‌ర్లు ఎన్ని గిమ్మిక్కులు ప్లే చేసినా.. ఆమె లొంగ లేదు. బ‌లంగా నిల‌బ‌డింది. కేసును నిల‌బెట్టింది. చివ‌రికి నిందితులు న‌లుగురికీ ఉరి శిక్ష ప‌డే వ‌ర‌కు విశ్ర‌మించ‌లేదు. ఉరి శిక్ష అమ‌ల‌య్యాక సీమ‌.. నిర్భ‌య త‌ల్లితో క‌లిసి మీడియా ముందుకు రాగా.. ఆమెకు అక్క‌డున్న జ‌నం నీరాజ‌నాలు అర్పించారు. సీమ‌కు మ‌ద్ద‌తుగా నినాదాలు చేశారు. సోష‌ల్ మీడియాలో అయితే సీమను నెటిజ‌న్లు గొప్ప‌గా కీర్తించారు. ఆమెకు అవార్డులివ్వాల‌న్నారు. సీమ‌ను లోక్‌స‌భ‌కో, రాజ్య‌స‌భ‌కో పంపిస్తే నిర్భ‌య కేసు వాదించిన అనుభ‌వంతో అమ్మాయిల‌కు మేలు చేసే చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.