మహా ఉపద్రవం: సెన్సెక్స్ కు సోకినా కరోనా

August 13, 2020

ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కూడా కలగని భయాలు నేటి ప్రపంచ మార్కెట్లలో కనిపిస్తున్నాయి. కారణం... కోవిడ్ 19 (కరోనా). ఇంతవరకు ప్రపంచాన్ని చుట్టిముట్టిన ఏ ఆర్థిక మాంద్యమూ భయపెట్టనంత దారుణంగా కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌పంచవ్యాప్తంగా 2800 అసువులు బాశారు. 83 వేల మందికి సోకింది. ఇంకా నిర్దారణ కాని సంఖ్య 50 వేలకు పైగానే ఉంటుందని అంచనా.  ఈ వైర‌స్ దెబ్బ‌కు పౌల్ట్రీ కుప్పకూలింది. టూరిజం అడ్డంగా ఆగిపోయింది. వ్యాపారం స్తంభించిపోయింది. ప‌రిశ్ర‌మ‌ల ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతిన్నది. సహజంగా ఈ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడుతుంది. పడింది కూడా. 

2008 తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు ఆ రేంజ్ లో కుప్పకూలిపోయాయి. శుక్ర‌వారం నాడు ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1448 పాయింట్లు న‌ష్ట‌పోయింది. క‌రోనా వైరస్ మెరుపు వేగం ముందు సెన్సెక్స్ విలవిలలాడిపోయింది. ఇదింకా ఎంత దారుణాలను సృష్టిస్తుందో తెలియక ప్రపంచ మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి. కరోనా తుమ్ముతో సృష్టించిన ఫెను తుపాను ధాటిని తట్టుకునే శక్తి ప్రపంచంలోని ఏ మార్కెట్లకు లేదు. 

ఇంతకాలం తర్వాత ఇపుడు ఎందుకు ఇలా అయ్యింది అంటే... ఇది అదుపులోకి వస్తుందేమో అని ఇంతకాలం అనుకున్నారు. కానీ అదుపులోకి రాకపోగా...  దాదాపు 50 దేశాలకు క‌రోనా పా​కింది. దీంతో ఇన్వెస్టర్ల వెన్నులో వ‌ణుకుపుట్టింది.భయాందోళనలకు గురైన​ ఇన్వెస్టురు అమ్మకాలకు​ తెగబడ్డారు.దీంతో, స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా పతమై అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. శుక్ర‌వారం ట్రేడింగ్ ముగిసే  సమయానికి సెన్సెక్స్ 1,448 పాయింట్లు నష్టపోయి 38,297కి పడిపోయింది. నిఫ్టీ 431 పాయింట్లు కోల్పోయి 11,201కి దిగజారింది. ​​