ఆయనకు కరోనా... ఫ్యాన్స్ గోల

August 09, 2020

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఎంతోమంది ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వారిలో కొందరు ప్రాణాలు కూడా వదిలారు. ఇప్పుడు ప్రముఖ క్రికెటర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. పాకిస్థాన్‌లో ఈ ఒరవడి కనిపిస్తోంది. 2003లో ప్రపంచకప్‌లో పాక్‌కు ఆడిన మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ తౌఫీక్ ఉమర్‌కు కరోనా సోకినట్లు ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే.

ఆ దేశంలో కరోనాతోనే జాఫర్ సర్ఫరాజ్, రియాజ్ షేక్ అనే 50 ఏళ్ల పైబడ్డ మాజీ క్రికెటర్లు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇప్పుడు ఆ దేశ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా కరోనా బాధితుడిగా మారాడు. కరోనా సహాయ కార్యక్రమాల్లో భాగంగా అఫ్రిది తన ఫౌండేషన్ తరఫున దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ గత నెలలో పర్యటించాడు.

ఈ నేపథ్యంలో అతను కరోనా బారిన పడ్డట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అఫ్రిదినే స్వయంగా ట్విట్టర్లో ప్రకటించాడు. గురువారం నుంచి అస్వస్థతగా ఉండటంతో తాను పరీక్షలు చేయించుకున్నానని.. కోవిడ్ పాజిటివ్‌గా తేలానని.. తాను త్వరగా కోరుకునేలా అందరూ ప్రార్థనలు చేయాలని ట్విట్టర్లో అభిమానులకు పిలుపునిచ్చాడు అఫ్రిది.

తమ స్టార్ ఆటగాడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పాక్ అభిమానులు ట్వీట్లు వేస్తుంటే.. భారత్‌లో అతడి యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. గత నెలలో అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వచ్చి మన ప్రధాని గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచమంతా కరోనాతో బాధ పడుతుంటే.. మోడీ తలలో కరోనాను మించిన వైరస్ ఉందంటూ విమర్శలు చేశాడు.

దీనిపై అప్పట్లో గౌతమ్ గంభీర్ సహా భారత క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభిమానులు కూడా అతడిని ట్రోల్ చేశారు. ఇప్పుడు కరోనా బారిన పడ్డ అఫ్రిదిపై మనవాళ్లు ఇంకా రెచ్చిపోయి ట్రోల్స్ వేస్తున్నారు.