ఏపీ 3 రాజధానులపై షకీలా పంచ్ అదిరిందిగా

August 13, 2020

ఏపీలో ఏర్పాటు చేస్తున్న మూడు రాజధానుల గురించి తెలిసిందే. ఈ మూడు రాజధానులతో లాభమా? నష్టమా? లాంటి చర్చ ఇక్కడ చేయటం లేదు. అసలా ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే.. ఇప్పటికే అలాంటివి చాలానే చేశారు. ఇక్కడ చెప్పే అంశం మీరే మాత్రం ఊహించలేనిది. షకీలా తెలుసుగా. ఒకప్పుడు తన అడల్ట్ సినిమాలతో మలయాళంలో పెద్ద హీరోలకు సైతం చుక్కలు చూపించిన శృంగార తార.
ఒకప్పుడు తన హాట్ అందాలతో వెండితెరకు వేడి పుట్టించిన ఆమె.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆమె మళ్లీ సినిమాలు చేస్తున్నారు. అలా చేస్తున్న సినిమాల్లో ఒకటి.. ‘‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’’. సినిమా టైటిల్ అదిరింది కదూ? రోటీన్ కు పూర్తి భిన్నంగా ఉన్న ఈ సినిమాలో కంటెంట్ సంగతి ఏమిటన్నది పక్కన పెడితే.. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ సంచలనంగా మారింది. దాసరి సాయిరాం దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తోపు హీరోలన్నోళ్లు సైతం ఏపీలోని మూడు రాజధానులపై పంచ్ వేయటం తర్వాత.. దాని ప్రస్తావనే తమకెందుకు? అన్నట్లు ఉన్న వేళలో.. అందుకు భిన్నంగా షకీలా భారీ పంచ్ వేసేసింది. తాజాగా విడుదల చేసిన టీజర్ లో పేపర్ చదువుతున్న షకీలా.. ఆంధ్రాకు మూడు రాజధానులు అనే వార్త చదువుతుంది. ఏపీకి మూడు రాజధానులా? అంటూ పక్కనున్న తన అసిస్టెంట్ ను అడుతుగుతుంది.
అవును మేడమ్.. జగనన్న మూడు రాజధానులు చేసేశాడు అని చెబుతాడు. దీనికి షకీలా.. ఒక్క స్టేట్ కు మూడు రాజధానులా? పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యం అవసరం లేదంటూ భారీ పంచ్ ను వేసేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు.. ఈ పంచ్ డైలాగ్ ఇప్పుడీ సినిమాను పాపులర్ చేస్తోంది. అసలే టైటిల్ భిన్నంగా ఉంటే.. అందుకు తగ్గట్లే షకీలా నోటి నుంచి వచ్చిన పంచ్ ఇప్పుడీ సినిమా మీద అందరి చూపు పడేలా చేసింది.