బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే... రీజనే షాకింగ్

July 07, 2020

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఊహించ‌ని రీతిలో ప‌రిణామాలు మారుతున్నాయి. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఇప్పటికే ప‌లువురు నేత‌లు అసంతృప్తిలో ఉండ‌గా....అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడానికి ఓ ఎమ్మెల్యే సిద్ధ‌మ‌వుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన‌ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ టీఆర్ఎస్‌కు షాకిచ్చేంత ప‌ని చేశారు. ఇవాళ ఉదయం నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ తో సమావేశం అయ్యారు. అనంత‌రం ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించలేదని షకీల్ అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన.. టీఆర్ఎస్‌కు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారా.. అంటే ఔననే అంటున్నారు ఆయన అనుచరులు. తాజాగా బీజేపీకి సీనియ‌ర్ నేత‌, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌తో భేటీ అయ్యారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన షకీల్.. పార్టీ మారితే మారొచ్చు అంటూ స్పందించారు.

మ‌రోవైపు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ...టీఆర్ఎస్ లోఎమ్మెల్యేలకు విలువ లేదని అన్నారు. ఆత్మాభిమానం చంపుకొని బ్రతకలేన‌ని ప్ర‌క‌టించారు. ఒక్క మైనార్టీ ఎమ్మెల్యేను గెలిస్తే.. మంత్రి పదవి ఇవ్వ‌లేదని...ఎంఐఎం వాళ్ళు ఏం చెబితే టీఆర్ఎస్ అధిష్టానం అదే వింటే ఎలా? అని ప్ర‌శ్నించారు. రెండు రోజుల్లో మీడియా సమావేశం పెట్టి త‌న నిర్ణయం ప్రకటిస్తాన‌ని సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు.