9 నెలల గర్భంతో 70 కిలోమీటర్లు, ప్రసవం తర్వాత బిడ్డతో 160 కిలోమీటర్లు

August 08, 2020

లాక్ డౌన్ కష్టాలు సామాన్యులకు వర్ణనా తీతం... పేదలు గూడు లేక, ఆదాయం లేక... సొంతింటికి చేరే మార్గం లేక .. ఒక్కో జాతీయ రహదారిలో లక్షల కొద్దీ జనం అలా నడుచుకుంటూ ఇళ్లకు పోయారు. 500, 600, కొందరు 1000 కిలోమీటర్లు కూడా నడిచారు. పొట్ట నింపుకుందాం అని పోతే.. కనీసం నిలువ నీడ ఇవ్వలేకపోయిన ఆ నగరాలంటే పేదోడికి వెగటు తెప్పించాయి. 

ఈ వలస కార్మికుల మహాపాదయాత్రల్లో గర్భిణులు కూడా ఉండటం అత్యంత శోచనీయం. చెక్ పోస్టుల్లో ఉన్న అధికారులు అటువంటి వారిని గుర్తించి కాస్త రవాణ సదుపాయం కల్పించి కరుణ చూపాల్సింది. కానీ అది జరగలేదు. కొందరయితే గర్భిణులు రోడ్డు పక్కన ప్రసవం అయిన ఉదంతాలు ఉన్నాయి. మన ఇళ్లలో ఎవరైనా కాన్పు అయితే.. ఇంకో మనిసి తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటిది అపుడే పుట్టిన పసికందును ఎత్తుకుని  ఎర్రటి ఎండలో 160 కిలోమీటర్లు నడిచిందా కన్నతల్లి. 

విషాదం ఏంటంటే 9 మాసాల కడుపుతో 70 కిలోమీటర్లు నడిచాక బిడ్డ పుట్టగా... సగం ఆకలితో బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్లు నడిచింది. అన్ని కిలోమీటర్ల అనంతరం ఒక మనసున్న పోలీసు అధికారి గమనించి మిగతా 700 కిలోమీటర్లకు రవాణ సదుపాయం కల్పించారు.

ప్రభుత్వాల బాధ్యతరాహిత్యానికి అసమర్థతకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ సంఘ‌ట‌న ‌మధ్యప్రదేశ్ లో జ‌రిగింది. 40 రోజుల అనంతరం రైళ్లు వేసిన సర్కారు ఇదే పని లాక్ డౌన్ మొదట్లో చేసి ఉంటే ప్రశంసలు దక్కేవి. జీరో ప్లానింగ్ తో అత్యంత దారుణంగా విఫలమైంది కేంద్రం. దీంతో సామాన్యులంతా తీవ్రమైన కష్టం దు:ఖం అనుభవించారు.

ఈ బాలింత కథ ఏంటంటే.... మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాకు చెందిన రాకేశ్‌ కౌల్‌, శకుంతల దంపతులు. మహారాష్ట్రలోని నాసిక్‌కు పనికోసం వలస వెళ్లారు. లాక్ ‌డౌన్ తో ఉపాధి పోయింది. సొంతూరుకు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. శంకుతల నిండు గర్భిణి. ప్రభుత్వాలు కరుణిస్తాయని ఆశ్రయం దొరుకుతుందని వారు వేచిచూశారు. అలాంటిదేమీ జరగలేదు.  రైళ్లు తిరిగి ప్రారంభించిన సమాచారం కూడా వారి వద్ద లేదు. దీంతో తమ నడకను నాసిక్‌ నుంచి మే 5న సాత్నాకు బయలుదేరారు. 70 కిలోమీటర్ల అనంతరం ఆగ్రా – ముంబయి జాతీయ రహదారి పక్కన శకుంతల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అంతే వెంటనే  మళ్లీ నడక మొదలుపెట్టారు. పసిబిడ్డతో ఎర్రటి ఎండలో 160 కిలోమీటర్లకు పైగా నడిచింది ఆ బాలింత. మన నాయకుల అసమర్థతకు, వ్యవస్థలో లోపాలు చూపడానికి ఇదొక్క కారణం చాలు.