షూటింగ్ యాక్సిడెంట్ లో శంకర్ కు గాయాలు?

August 11, 2020

షాకింగ్ గా మారిన ఇండియన్ 2 షూటింగ్ యాక్సిడెంట్ లో కొత్త విషయం బయటకు వచ్చింది. భారీ క్రేన్ విరిగి పడటంతో ఇద్దరు సహాయ దర్శకులతో పాటు.. మరొక స్టాపర్ మరణించిన ఈ ఉదంతంతో చిత్ర దర్శకుడు శంకర్ కు సైతం గాయాలైనట్లుగా తెలుస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నిర్మిస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇలాంటివేళ.. షూటింగ్ లో చోటు చేసుకున్న ప్రమాదం చిత్ర యూనిట్ నోట మాట రాకుండా చేసింది. ఇప్పటికి యూనిట్ సభ్యులు ప్రమాద షాక్ నుంచి బయటకు రాలేదు. అప్పటివరకూ తమతోనే పని చేసిన వారు.. శాశ్వితంగా లోకాన్ని విడిచిపెట్టటాన్ని చూసిన వారు కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు.
ఈ దారుణం ఎలా జరిగిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ ల్లో భారీక్రేన్లు వాడే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది.. విరిగిపోవటం.. భారీగా ఉండే క్రేన్ కిందకు పడటంతో తీవ్ర గాయాలకు గురైన ఇద్దరు షూటింగ్ స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదానికి పక్కనే ఉన్న దర్శకుడు శంకర్ కు సైతం గాయాల పాలయ్యారు. అయితే.. అవేవీ తీవ్రమైనవి కాకపోవటంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాలేదు.