శరద్ పవార్‌- మోడీ మధ్య ఏం జరిగింది

August 03, 2020

ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారంతో మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. అయితే.. అంతవరకు జరిగిన పరిణామాలపై చర్చలు మాత్రం ఆగడం లేదు. అంతేకాదు..  ఆ సమయంలో ఏమేం జరిగిందన్నది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అందులో ఎవరికి వారు తమకు తగ్గ వెర్షన్లు వినిపిస్తున్నా వినడానికి మాత్రం అవన్నీ ప్రజలకు ఆసక్తికరంగానే ఉంటున్నాయి. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అలాంటిదే ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.
మహా సంక్షోభం పీక్ స్టేజిలో ఉన్నప్పుడు తాను మోదీని కలిసినప్పుడు ఏమైందో ఆయన చెప్పుకొచ్చారు. ఇద్దరమూ కలిసి పని చేద్దామని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని, అయితే, తాను దాన్ని తిరస్కరించానని పవార్ అన్నారు. "మనిద్దరి మధ్యా వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. కానీ, కలిసి పనిచేయడం జరిగే పని కాదు" అని స్పష్టం చేసినట్టు పవార్ తెలిపారు. తనకు రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని అన్నారు. తన కుమార్తె సుప్రియా సూలేను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే విషయం మాత్రం చర్చకు వచ్చిందన్నారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో శరద్ పవార్ పై మోదీ ప్రశంసల వర్షం కురిపించడం, ఆ వెంటనే పవార్ హస్తినకు వెళ్లి చర్చలు జరపడంతో కొత్త పొత్తులు ఏర్పడనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అయితే, చివరకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికలో ప్రభుత్వం ఏర్పడింది.
అయితే, బీజేపీ నేతలు మాత్రం దీనిపై మరో వెర్షన్ వినిపిస్తున్నారు. పవార్ రాష్ట్రపతి పదవి, కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి కోరారని.. అందులో కుమార్తెకు పదవి ఇవ్వడం వరకు బీజేపీ ఓకే చెప్పిందని.. రాష్ట్రపతి పదవికి నో చెప్పిందని, అందుకే ఆయన శివసేన, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు.