షీలా దీక్షిత్ అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చు రూ.500 !!

May 27, 2020

ఒక రాష్ట్రానికి నాలుగు ద‌ఫాలు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నేత అంత్య‌క్రియ‌లు ఎంత ఘ‌నంగా జ‌రుగుతాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. అందుకు భిన్నంగా చాలా సింఫుల్ గా త‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌న్న ఆమె కోరిక మేర‌కు.. రికార్డు స్థాయి త‌క్కువ ఖ‌ర్చుతో అంత్య‌క్రియ‌లు పూర్తి చేసిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఢిల్లీ రాష్ట్రానికి నాలుగు ద‌ఫాలు వ‌రుస‌గా ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన షీలా దీక్షిత్ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.
ఆమె అంత్య‌క్రియ‌ల్ని ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో నిర్వ‌హించారు. ప్ర‌కృతి ప్రేమికురాలైన షీలా.. త‌న అంత్య‌క్రియ‌ల్ని సాదాసీదాగా నిర్వ‌హించాల‌ని.. వీలైనంత వ‌ర‌కూ కాలుష్యం లేని రీతిలో నిర్వ‌హించాల‌న్న కోరిక‌కు అనుగుణంగా ఆమె అంత్యక్రియ‌ల్ని నిర్వ‌హించారు.
సీఎన్జీ ప‌ద్ధ‌తిలో షీలా అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించారు. కాలుష్య ర‌హిత ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించిన దీనికి ఖ‌ర్చు కూడా త‌క్కువ‌. సాధార‌ణ క‌ట్టెల్ని ఉప‌యోగించి ద‌హ‌నం చేస్తే రూ.1000 ఖ‌ర్చు అవుతుంది. అదే సీఎన్జీతో అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హిస్తే రూ.500 ఖ‌ర్చు మాత్ర‌మే అవుతుంది.
అంతేకాదు.. ఈ ప‌ద్ద‌తిలో మృత‌దేహం పూర్తిగా కాలిపోవ‌టానికి కేవ‌లం గంట స‌మ‌యం మాత్ర‌మే తీసుకుంటుంది. అయితే.. ఈ రీతిలో షీలా అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించ‌టాన్ని కొంద‌రు వ్య‌తిరేకించారు. హిందూ సంప్ర‌దాయం కాద‌ని వాదించారు. అయితే.. ఆమె కోరుకున్న రీతిలోనే అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రాజ‌కీయంగా ఒక వెలుగు వెలిగిన ఒక సీనియ‌ర్ నేత ఆద‌ర్శ‌ప్రాయంగా త‌న అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించాల‌ని కోరుకోవ‌టం విశేషంగా చెప్పాలి.