ఢిల్లీ చక్రం... ఎలా తిరిగిందో !

July 08, 2020

చాలామంది చంద్రబాబు వయసు (69) చూసి వచ్చే ఎన్నికల్లో రిటైర్ మెంట్ తీసుకుంటున్నారా అనుకుంటూ ఉంటారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, గవర్నరుగా పనిచేసి ప్రస్తుతం ఢిల్లీ నుంచి లోక్ సభకు పోటీ చేసిన షీలా దీక్షిత్… వయసు ఎంతో తెలుసా? అక్షరాలా 80 ఏళ్లు. ఇప్పటికీ ఆమె చక్కగా ఉంది. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో వీధి వీధి తిరిగి ప్రచారం చేసింది. ఆమెకు ఆమ్ ఆద్మీ, బీజేపీ ప్రత్యర్థులు.
గవర్నర్ గా ఉన్న షీలా దీక్షిత్ ఎన్డీఏ అధికారంలోకి రావడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా రాహుల్ గాంధీ ఆమెకు ఢిల్లీ పట్టాలు ఇచ్చారు. అంతేకాదు, బరిలో నిలిపారు. ఢిల్లీ పై గట్టి పట్టున్న షీలా దీక్షిత్ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. సీట్లు తర్వాత... పార్టీ ఢిల్లీలో మళ్లీ బతికి బట్ట కట్టాలంటే ఒంటరి పోరు తప్పదని తెగేసి చెప్పిందావిడ. ఢిల్లీలోని ప్రతి వీధి తెలిసిన మనిషి, కాంగ్రెస్ లో తిరుగులేని మనిషి ... దీంతో రాహుల్ షీలా మాట విన్నారు.
కష్టం నష్టం తర్వాత ఒంటరిగా పోదాం అని డిసైడ్ అయ్యారు. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సి ఉంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లో 2 కాంగ్రెస్ కు ఇవ్వగలమని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంకేతాలు పంపారు. ఇరు పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. కానీ షీలా పొత్తు ససేమిరా వద్దన్నారు. ఆప్ తో పొత్తు పెట్టుకుంటే ఢిల్లీలో కాంగ్రెస్ క్యాడర్ జీరో అవుతుందని హెచ్చరించారు. చివరకు ఆమె మాట నెగ్గింది.
ఇప్పుడు షీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిచే అవకాశం ఉంది. కానీ ఇంకో రెండు సీట్లు అయినా ఇక్కడ గెలిస్తే ఆమెకు పార్టీ సలాం చేస్తుంది. నాలుగు లోక్ సభ స్థానాలు దక్కితే షీలా మరోసారి పార్టీలో మహారాణి అవుతారు. అక్కడ నాలుగు రావడం అంటే బీజేపీకి దేశంలో మెజారిటీ రాదనే లెక్క. ఏది ఏమైనా ఈ సీట్ల సంగతి పక్కన పెడితే... ఆమె నిర్ణయం పార్టీ భవిష్యత్తుకు మంచిదే.