టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్

August 04, 2020

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇందులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను కూడా చిత్తు చేసింది కోహ్లీ సేన. ప్రస్తుతం ఈ ఆనందంలో ఉన్న భారత అభిమానులకు జట్టు మేనేజ్‌మెంట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ గురించే ఆ వార్త. రెండు మ్యాచ్‌ల విశ్రాంతి తర్వాత జట్టులోకి వస్తాడని భావించిన ధవన్.. ప్రపంచకప్‌ మొత్తానికి దూరం అయ్యాడు.

ఈ విషయాన్ని భారత జట్టు మేనేజర్ సునీల్ సుబ్రమణియన్ అధికారికంగా వెల్లడించారు. ‘‘ఎడమ చేతి బొటన వేలికి గాయం కారణంగా శిఖర్ ధావన్ ప్రపంచకప్ నుంచి దూరమయ్యాడు. టోర్నీ చివరి దశ కల్లా అతడు కోలుకుంటాడని మేము భావించాము. కానీ, గాయం తగ్గడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. వారి సూచన మేరకు ఈ ప్రకటన చేస్తున్నాం. ధవన్‌కు రీప్లేస్‌మెంట్‌గా పంత్‌ను ఆడించే అవకాశం కల్పించాలని బీసీసీఐను కోరుతాం’’ అని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

రెండు రోజుల క్రితం కూడా టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్.. ధవన్ గురించి మాట్లాడారు. ‘‘ఐసీసీ మెగా టోర్నీల్లో ధావన్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. దీంతో అతడి సేవలను కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. అందుకే వీలైనంత సమయం వేచి చూద్దామని అనుకుంటున్నాం. వాస్తవానికి 10-12 రోజుల తర్వాత అతడు గాయం నుంచి కోలుకుంటున్న విధానాన్ని సమీక్షిస్తాం. ఆ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేస్తాం’’ అని ఆయన తెలిపారు. దీంతో ధవన్ మళ్లీ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా జట్టు ప్రకటన చేసింది.

టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్.. లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో గాయపడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బౌలర్ విసిరిన బంతి అతడి ఎడమచేతి బొటన వేలికి బలంగా తగిలింది. ఫిజియోతో ప్రథమ చికిత్స చేయించుకుని, అలాగే బ్యాటింగ్ చేసిన ధవన్.. 117 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం స్కానింగ్‌ చేయించగా బొటనవేలికి ఫ్రాక్చర్‌ అయినట్టు తేలింది. దీంతో అతడు మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించినా.. అది సాధ్యం కాలేదు.