రాజీనామాకు సిద్ధమంటున్న జగన్ ఎమ్మెల్యే

February 25, 2020

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక అంశాల మీద మాట్లాడినంత బలంగా జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరిగే అంశాల మీద పెద్దగా స్పందించటం కనిపించదు. మహా అయితే.. ఒకరిద్దరు దీనికి మినహాయింపుగా కనిపిస్తారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం మీదా.. ఎన్ ఆర్సీ చట్టాల మీద తెలుగు ఎమ్మెల్యేలు.. ఎంపీలు మాట్లాడటం కనిపించదు.
ఈ కొరతను తీర్చేలా వ్యవహరిస్తూ వార్తల్లోకి వచ్చారు కర్నూలు జిల్లాకు చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింల విషయంలో వివక్ష చూపేలా తీసుకొచ్చిన సీఏఏ.. ఎన్ ఆర్ సీ చట్టాలకు తమ పార్టీ మద్దతు ఇవ్వటాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు.
చట్టాన్ని అమలు చేసే సమయంలో ముస్లింలకు ఇబ్బందులు తలెత్తితే తాను ఊరుకోనన్న ఆయన.. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికైనా వెనుకాడనంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ చట్టాలకు తమ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) మద్దతు ఇవ్వటాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే తానీ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లానని.. ఆ చట్టాలతో ఎవరికీ నష్టం వాటిల్లదని చెప్పారన్నారు. అంతా బాగుంది కానీ.. అధినేత చెప్పిన మాటకు కన్వీన్స్ అయ్యారో.. కాలేదో క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా?