కీలక మలుపు.. సుప్రీంకు చేరిన మహా రాజకీయం

July 04, 2020

థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టుకునేందుకు శివసేన కోరిన అదనపు గడువును గవర్నర్ నో చెప్పటం.. తర్వాత ఛాన్స్ ఎన్సీపీకి ఇస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాము కోరిన అదనపు గడువు ఇవ్వని గవర్నర్ తీరుపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు ఒక రోజు టైమిచ్చిన గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. తాను ఇచ్చిన సమయానికి మద్దతును కూడగట్టలేకపోయిన శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా అదనపు సమయాన్ని ఇవ్వలేదు. దీనిపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇచ్చారని చెప్పిన శివసేన.. తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసి.. అత్యవసరంగా ఈ రోజే విచారణ చేపట్టాలని కోర్టును కోరింది.
మరోవైపు ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 గంటల వరకూ ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు పరిణామాలు ఇలా సాగుతుంటే.. మరోవైపు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అయి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ఓకే చేస్తూ నిర్ణయం తీసుకోవటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
 ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనటానికి బ్రెజిల్ వెళుతున్న నేపథ్యంలో మహా ఎపిసోడ్ కు ముగింపు పలికేలా రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.