అయిపాయె.. ఆ ట్రెండు ఇండియాలోను మొదలైంది

August 10, 2020

ప్రముఖులకు కరోనా వచ్చే ట్రెండు మనదేశంలోను మొదలైంది

టాప్ సెలబ్రిటీ ఐశ్వర్య, అమితాబ్ లకు, ఇపుడు పొలిటికల్ టాప్ సెలబ్రిటీలు అయిన ముఖ్యమంత్రులకు కూడా సోకడం మొదలవుతుంది. ఎంతయినా ఖర్చుపెట్టే డబ్బులు ఉండి, వ్యవస్థ ఉండి, టెస్టింగ్ అవకాశం ఉండి.. జాగ్రత్తలు తీసుకోవడానికి మనుషులున్న ముఖ్యమంత్రులకే కరోనా సోకితే ఇక సామాన్యుడికి రావడంలో ఆశ్చర్యం, విచిత్రం ఏం లేదు.

తాజాగా మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు కరోనా వైరస్ సోకింది. తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన  విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలింది.

దీంతో అతనికి వైద్యులు చికిత్స మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని ట్విట్టరులో ప్రకటించిన సీఎం శివరాజ్... తనతో కాంటాక్ట్ అయినవారు, సహచరులు కరోనా టెస్టులు వెంటనే చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పిలుపునిచ్చారు.

తన సిబ్బంది అందరినీ క్వారంటైన్ కు వెళ్లనున్నట్లు ఆయనే తెలిపారు. 

కరోనా సోకిన సీఎం భరోసాగా ఉన్నారు. చికిత్సలో ఉండి కూడా వీలైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా పై సమీక్షలు నిర్వహిస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారాయన.

‘మార్చి 25 నుంచి రోజూ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నాను. ప్రస్తుతం వీలైనంతవరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడానికి ప్రయత్నిస్తాను’ అని స్వయంగా తెలిపారు. 

ప్రధాన కార్యకలాపాలన్నీ తన స్థానంలో హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, పట్టణాభివృద్ధి, పరిపాలన మంత్రి భూపేంద్ర సింగ్, వైద్య ఆరోగ్య విద్య మంత్రి విశ్వాస్ సారంగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ పీఆర్ చౌధురి నిర్వహిస్తారని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. 

చికిత్స తీసుకుని త్వరలో కోలుకుంటాను అని ఆయన అన్నారు.