టీడీపీ కేడర్ లో జోష్ - జేసీ ఫ్యామిలీయా మజాకా?

June 04, 2020

ఏపీలో స్థానిక సంస్థలు మార్చి నెల ఎండలకు మించి సెగపుట్టిస్తున్నాయి. ఓ వైపు అధికారంలో ఉన్న వైసీపీ...కుదిరితే ఏకగ్రీవం...కుదరకపోతే.. బెదిరింపులు అన్నతరహాలో ఎన్నికలను ఏకగ్రీవం కమ్ ఏకపక్షంగా జరిపేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. మరోవైపు, వైసీపీనీ దీటుగా ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోన్న టీడీపీ నేతలు ఒకింత దిగాలుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాభవంతో లోకల్ వార్ లో గెలవడం కష్టమని చాలా మంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనికతోడు, టీడీపీలోని పలువురు కీలక నేతలు...వైసీపీ గూటికి  క్యూ కడుతుండడంతో టీడీపీ కేడర్ లో ఉన్న ఆ కొద్దిగ జోష్ కూడా పోయింది. ఇటువంటి నేపథ్యంలో అనంతపురం ఫైర్ బ్రాండ్ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ....టీడీపీ లీడర్లతోపాటు క్యాడర్లోనూ జోష్ నింపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేసి ఇటు అధికార...అటు ప్రతిపక్ష నేతలకు షాకిచ్చారు. 

అనంతపురం జేసీ బ్రదర్స్ ఏది చేసినా సంచలనమే. అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ....జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాను బాధ్యతలు నిర్వహించిన పదవి కంటే తక్కువ పదవికి నామినేషన్ వేసి షాకిచ్చారు. వైసీపీకి భయపడి పోటీకి దూరంగా ఉండడం కాదని....వైసీపీని దీటుగా ఎదుర్కొనేందుకు కౌన్సిలర్ గా అయినా పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్ గా ఆయన నామినేషన్ వేశారు. అదే వార్డు నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడంతో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయడంతో తాడిపత్రి టీడీపీ కేడర్ లో జోష్ వచ్చింది. తాడిపత్రి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగతా టీడీపీ అభ్యర్థులకు జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయం కొండంత ధైర్యాన్నిచ్చిందని టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జేసీ బ్రదర్స్ పై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడిపత్రి లోకల్ వార్ లో టీడీపీ గెలిస్తే...వైసీపీ డామినేషన్ ను కొంతవరకు తగ్గించవచ్చని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దారెడ్డి చేతిలో జేసీ ప్ర్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఓటమిపాలయ్యారు.ఇపుడు పెద్దిరెడ్డి కుమారుడు హర్షవర్థన్ ను ఓడించి....జేసీ ప్రభాకర్ రెడ్డి రివేంజ్ తీర్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. మరి, జేసీ రివేంజ్ ప్లాన్ ఎంతవరకు నెరవేరుతుందో వేచి చూడాలి.