హైకోర్టులోనూ షాక్‌!.. వాట్ నెక్ట్స్ ర‌విప్రకాశ్?

May 28, 2020

టీవీ 9 నుంచి కొత్త యాజ‌మాన్యం మెడ‌బ‌ట్టి గెంటేసినంత ప‌నిచేసిన త‌ర్వాత టీవీ9 వ్య‌వ‌స్థాప‌కుడు ర‌విప్ర‌కాశ్ ప‌రిస్థితి ఏమాత్రం బాగా లేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఫోర్జ‌రీ, నిధుల మ‌ళ్లింపు త‌దిత‌ర ఆరోప‌ణ‌ల‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసులు న‌మోదు చేయ‌గా... విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిన ర‌విప్ర‌కాశ్‌... పోలీసుల నోటీసుల‌ను చాలా లైట్ తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇలా అజ్ఞాతంలో ఉంటే... ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతుంది క‌దా. ఇప్పుడు ర‌విప్ర‌కాశ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. విచార‌ణ‌కు ర‌మ్మ‌న్న పోలీసుల నోటీసుల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌ని ర‌విప్ర‌కాశ్ ఎక్క‌డికెళ్లారో కూడా చెప్ప‌డం లేదు.

ఇదిలా ఉంటే... పోలీసులు జారీ చేసిన నోటీసుల గ‌డువు ముగిసిపోతున్న నేప‌థ్యంలో నేటి ఉద‌యం ఆయ‌న స‌డెన్ గా హైకోర్టు గ‌డ‌ప తొక్కారు. సైబర్‌ క్రైం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్‌ బుధవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదంటూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. మొత్తంగా చివ‌రి నిమిషంలో అయినా త‌న‌ను ఆదుకుంటుంద‌ని ర‌విప్ర‌కాశ్ భావించివ‌న హైకోర్టు కూడా ఆయ‌న‌కు షాకిచ్చింద‌నే చెప్పాలి.

మ‌రి హైకోర్టు కూడా ఆయ‌న వాద‌న‌ను త‌ప్పుబ‌ట్టిన‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించ‌డంతో ఇప్పుడు ర‌వి ప్రకాశ్ ముందున్న ప్ర‌త్యామ్నాయాలేమిటి? అన్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌కు పోలీసులు ఇప్ప‌టికే సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో ఇచ్చిన గడువు ముగియడంతో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. కోర్టులో కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాశ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారా? లేక పోలీసుల ఎదుట లొంగిపోతారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్‌ బుధవారంలోగా పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్‌ జారీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా పరారీలోనే ఉండటం గమనార్హం. మొత్తంగా పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైతే ప‌రిస్థితి ఇంత‌దాకా వ‌చ్చేదే కాద‌న్న వాద‌న కూడా గ‌ట్టిగానే వినిపిస్తోంది. అంటే త‌న ప‌రిస్థితిని తానే జ‌ఠిలం చేసుకున్న ర‌విప్రకాశ్ ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది.