స్టాలిన్ కు ఊహించని షాకిచ్చిన తమిళులు

July 12, 2020

రెండు రాష్ట్రాలకు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎంపీ.. అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా తాజాగా వెలువడుతున్న ఫలితాలు ఉన్నట్లుగా చెప్పక తప్పదు. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరే.. తమిళనాడులో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పలో కాలేశాయి.
నంగునేరి.. విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష డీఎంకే ఖాతాలో పడతాయన్న అంచనాలకు భిన్నంగా తాజా ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో అధికారిక అన్నాడీఎంకే బలహీనమవుతూ.. విపక్షడీఎంకే బలపడుతుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఉన్నాయి.
ఓట్ల లెక్కింపును చూస్తే.. డీఎంకే కంటే అన్నాడీఎంకే అభ్యర్థులే ముందంజలో ఉండటం ఆసక్తికరంగా మారింది. అమ్మ మరణం తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే బలహీనవుతూ.. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే బలపడుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే భారీ షాక్ తగిలేలా డీఎంకే పెద్ద ఎత్తున ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికల్లోనూ డీఎంకేకు విజయం పక్కా అన్నట్లుగా అంచనాలు వెలువడ్డాయి.
తీరా ఈవీఎంలు ఓపెన్ చేసి.. ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత ఫలితం మరోలా ఉంది. రెండు స్థానాల్లోనూ అన్నాడీఎంకే గెలుపు ఖాయమన్నట్లుగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కాస్త నిరాశకు గురైన అధికార పక్షం తాజా విజయంతో రెట్టించిన ఉత్సాహాన్ని ప్రదర్శించటం ఖాయమంటున్నారు. మరో రెండేళ్లలో (2021)లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటివేళ జరిగిన ఉప ఎన్నికలో అధికారపక్ష అభ్యర్థులు విజయం సాధించటం డీఎంకే అధినేత స్టాలిన్ కు షాకింగ్ గా మారతాయనటంలో సందేహం లేదు.