టీడీపీ ఎంపీకి షాక్.. వాళ్లిద్దరికీ టికెట్ ఇవ్వట్లేదట

December 06, 2019

చంద్రబాబు ప్రోద్బలంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ప్రముఖ సినీ నటుడు, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నారని తెలిసింది. పదేళ్లుగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో మాగంటి మురళీమోహన్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ పక్షాన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు చేరువయ్యారు. ఉచితంగా మెగా వైద్యశిబిరాలు వంటివి నిర్వహించి సేవలందించారు. దీంతో 2014 ఎన్నికల్లో మురళీమోహన్‌కి కలిసొచ్చాయి. ఆయనను రాజమహేంద్రవరం ఎంపీగా గెలిపించాయి. అయితే ఎంపీగా ఎన్నికయ్యాక మాత్రం ముందటి స్థాయిలో ఆయన మన్ననలు పొందలేకపోయారు. అధికారిక కార్యకలాపాల నిమిత్తం ఢిల్లీలోనే ఎక్కువగా ఉండాల్సి రావడం, 2016లో సర్జరీ చేయించుకోవడం వంటి కారణాల రీత్యా ప్రజలకు కొంత దూరమయ్యారు. ఎంపీ మురళీమోహన్ స్థానికంగా అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారమూ సాగింది. మురళీమోహన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలోనే ఆయన కోడలు మాగంటి రూపాదేవి తెరపైకి వచ్చారు.

 

 ఎంపీపై స్థానికంగా ఏర్పడిన వ్యతిరేకతను గమనించి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వచ్చి ఇక్కడే మకాం వేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో, పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో రూపాదేవి మమేకమయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల ఇబ్బందులను అవగతం చేసుకుంటున్నారు. వాటిని ఎప్పటికప్పుడు ఎంపీ మురళీమోహన్ దృష్టికీ, అధికారుల దృష్టికీ తీసుకువెళుతున్నారు. ఎంపీ దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ రూపాదేవి పర్యటిస్తున్నారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఇలా తనదైన వ్యవహారశైలితో ఎంపీ కోడలు రూపాదేవి అందరినీ ఆకర్షించారు. ఈ తరుణంలోనే ఎంపీ వారసురాలిగా రూపాదేవి రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వినిపించాయి. దీనికితోడు మురళీమోహన్ పోటీ చేయనని అధినేతకు చెప్పేశారు. దీంతో రూపాదేవికి టికెట్ కన్ఫార్మ్ అని అంతా అనుకున్నారు. కానీ, వీళ్లిద్దరికీ టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే దీనిపై వారితో చంద్రబాబు మాట్లాడారని సమాచారం. ఈ స్థానం నుంచి బొడ్డు భాస్కర రామారావు, కెప్టెన్‌ మూర్తి, గన్ని కృష్ణలు కూడా రేసులో ఉన్నారు.