టీవీ9 రవి ప్రకాశ్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు

February 24, 2020

ప్రముఖ న్యూస్ చానెల్ టీవీ9 వ్యవస్థాపక అధ్యక్షుడు రవి ప్రకాశ్‌కు కాలం కలిసి రావడం లేదు. ప్రస్తుత యాజమాన్యం అతడిపై వేసిన కేసులను తప్పించుకునేందుకు ఆయన చేసిన ఏ ప్రయత్నమూ ఫలించడం లేదు. ఈ వివాదం చెలరేగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆయన జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మొదట తెలంగాణ హైకోర్టు రవి ప్రకాశ్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రవి ప్రకాశ్ తరఫు న్యాయవాది రాం కిషోర్‌ సింగ్‌ యాదవ్‌ గత బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.

ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన రవి ప్రకాశ్‌కు అత్యున్నత న్యాయ స్థానం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని టీవీ9 మాజీ సీఈవోకు సుప్రీం కోర్టు సూచించింది. అదే సమయంలో బెయిల్ పిటిషన్‌పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అలాగే ఈ నెల 10 రవి ప్రకాశ్ ముందస్తు బెయిల్‌పై సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టుకు చెప్పింది. అంతేకాదు, 41ఏ నోటీసు కింద విచారణకు హాజరుకావాలని రవిప్రకాష్‌ను కూడా ఆదేశించింది. దీనితో పాటు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిపై సుప్రీం కీలక సూచనలు చేసింది. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది.

ఈ తీర్పుతో ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాశ్‌ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి అలంద మీడియాను మోసగించిన కేసులో విచారణకు హాజరుకావాలని రవి ప్రకాశ్‌కు పోలీసులు ఎప్పుడో నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు రెండు సార్లు సీఆర్పీసీ సెక్షన్ల 160, 41(ఎ) కింద నోటీసులు జారీ చేశారు. అలాగే లుక్‌ అవుట్‌ నోటీసులతో పాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అలర్ట్‌ చేశారు. అయితే పోలీసుల ముందు విచారణకు హాజరుకాకుండా న్యాయవాదుల సహకారంతో రవి ప్రకాశ్ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇక, సుప్రీం ఆదేశాలతో రవి ప్రకాశ్ విచారణకు హాజరు అవుతారని తెలుస్తోంది. రవి ప్రకాశ్ మీద తెలంగాణ పోలీసులు మూడు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.