ఆస్ట్రేలియాలో మనమ్మాయిని అలా ట్రీట్ చేశారట

August 07, 2020

టీవీ నటిగా సుపరిచితురాలైన మనమ్మాయి చాందిని భగ్వనాని తాజాగా ఆస్ట్రేలియాలో వర్ణ వివక్షను ఎదుర్కొన్నారు. తనకు ఎదురైన షాకింగ్ ఘటన గురించి ఆమె ట్వీట్ రూపంలో ఒక వీడియో విడుదల చేశారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న సదరు వీడియోలో ఆమె పేర్కొన్న విషయాల్ని విన్నంతనే ఒళ్లు మండక మానదు. భారతీయుల పట్ల ఆస్ట్రేలియా డ్రైవర్ ఒకరు వ్యవహరించిన తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది.

కొన్ని ప్రోగ్రామ్ లు చేయటానికి ఆస్ట్రేలియా వెళ్లిన చాందిని లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకపోయారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. మెల్ బోర్న్ నుంచి తాను వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా తొలిసారి బస్సులో ప్రయాణించానని చెప్పింది. అప్పటివరకూ బస్సులో జర్నీ చేయలేదని చెప్పింది.

స్థానిక అధికారుల సూచనతో తాను బస్సు ఎక్కానని.. అది వెళుతున్న రూట్.. తన గూగుల్ మ్యాప్ కు భిన్నంగా ఉండటంతో ఆమె కంగారుకు గురయ్యారు. తాను వెళ్లాల్సిన గమ్యస్థానానికి బస్సు వెళుతుందా? లేదా? అన్న వివరాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా డ్రైవర్ వద్దకు వెళ్లి.. వివరాలు అడిగినట్లు చెప్పారు. తాను ఎంతో మర్యాదగా అడిగినా డ్రైవర్ నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. తనకు బదులివ్వని డ్రైవర్.. బస్సులోని మిగిలిన ప్రయాణికులకు మాత్రం గౌరవంగా బదులిచ్చినట్లు చెప్పారు.

దీంతో.. తాను అడిగిన ప్రశ్నను విని ఉండరన్న ఉద్దేశంతో మరోసారి తాను వెళ్లాల్సిన గమ్యస్థానానికి బస్సు వెళుతుందా? లేదా? అని అడగ్గా మరోసారి మౌనమే సమాధానమైందన్నారు. దీంతో.. ఈసారి తాను కాస్తంత గట్టిగా.. తాను అడుగుతున్న దానికి బదులివ్వరేమిటని ప్రశ్నించగా.. బస్సును ఆపేసి.. కిందకు దిగాలని గద్దించారన్నారు. అంతేకాదు.. చెత్త భారతీయులారా.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ దురుసుగా వ్యాఖ్యానించారన్నారు.

తన మీద ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. బూతులు తిట్టిన వైనంతో తానుషాక్ కు గురయ్యానని.. ఎలా స్పందించాలో తనకు అర్థం కాలేదన్నారు. వణుకుతూనే తాను బస్సు దిగిపోయినట్లు చెప్పారు. జాతి వివక్ష ఉందనటానికి తాజా ఉదంతమే నిదర్శనమని ఆమె వాపోయారు. టీవీ నటి చాందినికి ఎదురైన చేదు అనుభవంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో మనమ్మాయికి ఎదురైన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.