ఊర్మిళ‌ స‌భ‌లో షాకింగ్ ప‌రిణామం

July 13, 2020

ఒక‌ప్పుడు త‌న అందంతో యావ‌త్ దేశాన్ని త‌న గురించి మాట్లాడేలా చేసిన గ్లామ‌ర‌స్ హీరోయిన్ ఊర్మిలా మటోండ్క‌ర్ రాజ‌కీయాల్లోకి రావ‌టం.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌టం తెలిసిందే. రంగీలా సినిమాలో ఒక్క‌సారి భారీ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆమె.. గ‌డిచిన కొద్ది కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి భారీగా వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తున్న ఆమెకు.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నార్త్ ముంబై కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆమెకు.. బీజేపీ నుంచి ఊహించ‌ని స‌వాళ్లు ఎదుర‌వుతున్న‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా అలాంటి సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బోరివెలీ రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ఆమె ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ కార్య‌క‌ర్తలు ప‌లువురు అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన వైనం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.
ఈ ఉదంతంపై ఊర్మిళ స్పందిస్తూ.. తాము ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో పాతిక మంది మోడీ ప‌రివారం పార్టీ జెండాల‌తో ర్యాలీలోకి చొచ్చుకువ‌చ్చార‌న్నారు. మోడీ పేరుతో నినాదాలు చేసిన‌ట్లుగా ఆమె వెల్ల‌డించారు. బీజేపీకి చెందిన వారి ర‌చ్చ‌తో రెండు పార్టీల మ‌ధ్య వివాదం చెల‌రేగింది. ఊర్మిళ‌ను ఉద్దేశించి అస‌భ్య నృత్యాలు చేయ‌టం.. వ్యాఖ్య‌లు చేయ‌టంపై ఊర్మిళ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈ ఉదంతంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
ప్ర‌త్య‌ర్థుల‌పై అధిక్య‌త‌ను సాధించాలంటే మ‌రింత ప్ర‌చారం చేయ‌ట‌మో.. లేదంటే ఓట‌ర్ల మ‌న‌సులు దోచుకునేలా చేయాలే కానీ.. ఇలా అభ్య‌ర్థి ప్ర‌చారాన్ని అడ్డుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేధింపులు నెగిటివ్ గా మారి బీజేపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంద‌ని.. మోడీ లాంటి నేత దిశానిర్దేశంలో న‌డిచే పార్టీలో ఇలాంటి చిల్ల‌ర చేష్ట‌లా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది.