సంచలనం ; వైట్ హౌజ్ లో వేద పఠనం

August 08, 2020

మంచి ఎక్కడున్నా దాన్ని తీసుకోవటం తప్పేం కాదు. కానీ.. కొన్నింటికి మతం ముద్ర వేయటం.. దరిద్రపుగొట్టు సిద్ధాంతాల్ని.. వాదనల్ని వినిపించటం మన దేశంలో ఉన్నంతగా మరెక్కడా ఉండవేమో? తాజాగా అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌజ్ లో జరిగిన కార్యక్రమం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటి కార్యక్రమమే.. మన దేశంలో జరిగి ఉంటే.. ఈపాటికి ఎంత రచ్చ జరిగేదో? అన్న భావన కలుగక మానదు.
ఇంతకీ వైట్ హౌజ్ లో నిర్వహించిన ప్రోగ్రాం ఏమిటన్న విషయంలోకి వెళితే..ప్రపంచం మొత్తం వణికిపోతున్న వేళ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఉపశమనం లభించని పరిస్థితి. పేరుకు అగ్రరాజ్యమే అయినా.. కంటికి కనిపించనంత చిన్ని ప్రాణి దెబ్బకు విలవిలలాడిపోతోంది. లక్షలాది మంది రోగాన బారిన పడటం.. వేలాది మంది ఇప్పటికే మరణించటం తెలిసిందే. ఇలాంటి గడ్డుపరిస్థితుల్లో దేవుడి మీద భారం వేసేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
తాజాగా వైట్ హౌజ్ లో వేద పఠనాన్ని నిర్వహించారు. ఇప్పుడు పరిస్థితుల్లో అమెరికాను మాత్రమే కాదు.. ప్రపంచ ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో వేదిక్ శాంతి పఠనం పేరుతో ఒక కార్యక్రమాన్నినిర్వహించారు. అమెరికా ప్రజల ఆరోగ్యం.. రక్షణ కోసం ఈ వేద పఠనాన్ని చేపట్టినట్లు చెబుతున్నారు. స్వామి నారాయణ్ మందిర్ పూజారి హరీశ్ బ్రహ్మభట్ నిర్వహించిన ఈ కార్యక్రమం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
శాంతి కోసం హిందూ ప్రార్థనను నిర్వహించటం ఒక విశేషం. ఒకవేళ.. ఇలాంటి పఠనమే మన రాష్ట్రపతి భవన్ లో కానీ.. మరెక్కడైనా కానీ నిర్వహించి ఉంటే.. గుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేవారు. హిందూ ధర్మాన్ని ఆచరించని దేశంలోనే.. తమ దేశం బాగోవాలన్న ఉద్దేశంతో నిర్వహించిన కార్యక్రమం గురించి తెలిస్తే భారతీయులు సంతోషపడటం ఖాయం. ప్రార్థనల్లో భాగంగా యజుర్వేదంలో భాగాన్ని పఠించినట్లుగా తెలుస్తోంది. ప్రార్థనల అనంతరం.. ప్రార్థన సారాంశాన్ని ఇంగ్లిషులో అనువదించి చెప్పటం గమనార్హం. వేదాల గొప్పతనాన్ని ప్రపంచానికే పెద్దన్న అమరికా గుర్తించటం విశేషం.